నాలుగు నెలల్లోనే నోటిఫికేషన్‌మార్పులపై నిలదీత
ఎవరి అభ్యంతరాలతో మార్పులు చేశారో చెప్పాలి
ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్
ఎన్నికలకు సిద్ధమే.. కానీ ప్రక్రియ
పారదర్శకంగా ఉండాలన్న
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీలో కార్పొరేషన్ వార్డుల సంఖ్య పెంపు అంశంలో ప్రభుత్వం, అధికారుల మధ్య సమన్వయం, స్పష్టత కొరవడిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జీవీఎంసీ వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించి అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్‌పై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తొలుత 98 నుంచి 120 వార్డులకు పెంచుతామని, మరోవైపు భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి తదితర గ్రామాలు, మండలాలను నగర పరిధిలోకి తీసుకొస్తామని ప్రకటించడం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొందన్నారు. ఎన్నో దశాబ్దాలుగా కలిసి మెలిసి జీవిస్తున్న గ్రామాలను డీలిమిటేషన్ పేరుతో అడ్డదిడ్డంగా విభజించడం వల్ల ఆయా ప్రాంతాల సామాజిక, సాంస్కృతిక స్వరూపం దెబ్బతింటుందని ఆయన అన్నారు. గ్రామాల మధ్య ఉన్న అనుబంధాలు, తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం సరిహద్దుల మార్పులు చేయడం సరైన విధానం కాదన్నారు.120 వార్డులు చేసినా, 150 వార్డులు చేసినా వైఎస్సార్ సీపీకి ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కేకే రాజు స్పష్టం చేశారు. అయితే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజలకు పరిపాలనా సౌలభ్యం ఉండటం ముఖ్యమన్నారు.
ఇటీవల విడుదల చేసిన వార్డుల డీలిమిటేషన్ నోటిఫికేషన్‌లో మార్పులపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. 2026 మే నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు, ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు మధ్య నాలుగు నెలలు కూడా పూర్తికాకముందే మార్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, వినతుల ఆధారంగా మార్పులు చేసినట్లయితే.. ఎవరి అభ్యంతరాల మేరకు ఏయే మార్పులు చేశారో బహిరంగంగా తెలియజేయాలని కోరారు. నోటిఫికేషన్‌లో కానీ, పత్రికా ప్రకటనలో కానీ వివరాలు స్పష్టంగా పేర్కొనకుండా మార్పులు చేయడం సరైన విధానం కాదన్నారు.అదేవిధంగా పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన సచివాలయాల మ్యాపింగ్‌లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కేకే రాజు కోరారు. కొన్ని ప్రాంతాల్లో ఒక వార్డుకు సంబంధించిన సచివాలయాన్ని మరో వార్డుతో మ్యాపింగ్ చేయడం వల్ల ప్రజలకు పరిపాలనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.
ఒక వార్డులో ఉన్న సచివాలయం అదే వార్డుకు అనుసంధానమై ఉండేలా మ్యాపింగ్ చేయాలని వైఎస్సార్ సీపీ కోరుకుంటోందని కేకే రాజు తెలిపారు.


