ఆనందపురం: కూల్‌డ్రింక్ అనుకుని పొరపాటున పురుగు మందు తాగిన ఓ వృద్ధ రైతు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలోని ఆనందపురం పంచాయతీ పొడుగుపాలెంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు బంటుబిల్లి సూరి అప్పలనాయుడు(61)కు మద్యం తాగే అలవాటు ఉంది. ఈ నెల 6న సాయంత్రం మద్యం తాగిన అనంతరం మిగిలిన మద్యాన్ని తన పొలంలోని షెడ్డులో దాచాడు. మరుసటి రోజు ఉదయం షెడ్డు వద్దకు వెళ్లి మిగిలిన మద్యాన్ని తాగాడు. అదే సమయంలో అక్కడ ఉన్న 750 మి.లీ. థమ్స్ అప్ బాటిల్‌లో నిల్వ చేసిన పురుగు మందును కూల్‌డ్రింక్‌గా భావించి తాగేశాడు. ఆ రాత్రి నుంచి తీవ్ర వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు తొలుత స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడిని సంప్రదించారు. అనంతరం గాయత్రి నర్సింగ్‌హోమ్‌కు, అక్కడి నుంచి నగరంలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల సూచన మేరకు ఈ నెల 13న కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి పెద్ద కుమారుడు బంటుబిల్లి వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ ఎస్.పార్థసారథి దర్యాప్తు చేస్తున్నారు.


