డాబాగార్డెన్స్: సమాజంలోని వెనుకబడిన వర్గా(బీసీ)ల అభ్యున్నతికి, సామాజిక సమానత్వానికి సర్దార్ గౌతు లచ్చన్న చేసిన కృషి చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ అన్నారు. గౌతు లచ్చన్న జయంతి పురస్కరించుకుని గ్రీన్‌పార్క్ హోటల్ సమీపాన ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లచ్చన్న అందించిన సేవలు స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం సర్దార్ లచ్చన్న చేసిన పోరాటం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, బీసీ సంఘాల నాయకులు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని నివాళులర్పించారు.


