182 బాటిళ్ల మద్యం స్వాధీనం,
నిందితుల అరెస్ట్
పెందుర్తి: మండలంలోని రాంపురంలో పంద్రాగస్టు నాడు భారీ ఎత్తున అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. సీఐ కె.వి.సతీష్‌కుమార్ తెలిపిన వివరాలు.. రాంపురంలోని కృష్ణా పాన్‌షాప్‌లో అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్మకాలు జరుతున్నట్లు శనివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సీఐ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ దేముడు సిబ్బందితో కలిపి బెల్ట్ దుకాణంపై దాడి చేశారు. మొత్తం రూ.31,750 విలువైన 34 బీర్లు, 148 విస్కీ క్వార్టర్ బాటిళ్లు(మొత్తం 182 బాటిళ్లు) స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పినగాడికి చెందిన రెడ్డి కృష్ణ, భీమునిపట్నానికి చెందిన బోరా జగదీష్‌లను అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు. బెల్ట్ మద్యం దుకాణాలపై దాడులు ముమ్మరం చేస్తున్నట్లు ఈ సందర్భంగా సీఐ చెప్పారు. అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


