గాజువాక: వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను గాజువాక క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. గాజువాక పోలీస్ స్టేషన్‌లో క్రైం సీఐ జి.డి.బాబుతో కలిసి క్రైం ఏసీపీ వెంకటరావు మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 6న శ్రీనగర్‌లో రోడ్డుపక్కన పార్కింగ్ చేసిన పల్సర్ బైక్ చోరీకి గురైనట్లు అందిన ఫిర్యాదుతో క్రైం సీఐ జి.డి.బాబు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎల్వీనగర్ సమీపంలోని తుప్పల ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరు యువకులు పోలీసులను గమనించి పరారయ్యేందుకు యత్నించారు. వారిని క్రైం ఎస్‌ఐ హరికృష్ణ సిబ్బందితో కలిసి వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల గుట్టు రట్టయింది. అరెస్టయిన వారిలో పెద్దాడ రాజ్‌కుమార్, పాంగి లక్ష్మణ్ అలియాస్ చిన్ను, సునీల్ ఖారా అలియాస్ సుస్సు ఉండగా, మరో ఇద్దరు మైనర్లు కూడా ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. వీరి నుంచి 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.


