మధురవాడ: జిల్లాలోనే అధిక డిపాజిట్లు, రుణాల పంపిణీతో ప్రత్యేక గుర్తింపు పొందిన ‘ది మధురవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం’ (పీఏసీఎస్) వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఈ సంఘంలో రూ.60 లక్షల నిధుల లావాదేవీ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. చనిపోయిన వ్యక్తి ఖాతాలోని సొమ్మును, అతని కుటుంబ సభ్యుల సమ్మతి లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఇతర ఖాతాలకు బదిలీ చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో సంఘం కార్యదర్శితో పాటు కొందరు పెద్దల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు సంఘం చైర్మన్, కార్యదర్శి చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో.. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను కలిసి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.
రూల్స్ బ్రేక్.. ఆరుగురి ఖాతాల్లోకి జంప్!
బాధితులు, గ్రామ పెద్దల వివరాల ప్రకారం.. జీవీఎంసీ 7వ వార్డు నగరంపాలెంకు చెందిన వాండ్రాసి అప్పలస్వామి 2016 మార్చి 1న మరణించారు. ఆయన పేరుపై మధురవాడ పీఏసీఎస్‌లో ఉన్న ఖాతాలో సుమారు రూ.60 లక్షల నగదు జమ ఉంది. అయితే, బ్యాంకు నిబంధనల ప్రకారం మరణించిన వ్యక్తి ఖాతాలోని సొమ్మును వారసులకు బదిలీ చేయాలంటే మరణ ధ్రువీకరణ పత్రం, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తప్పనిసరి. కానీ, అవేవీ లేకుండానే ఈ నెల 8న ఆ భారీ మొత్తాన్ని అదే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తుల ఖాతాల్లోకి గుట్టుచప్పుడు కాకుండా బదిలీ చేసేశారు. ఇంత పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీ జరిగినా ఉన్నతాధికారులు ఇప్పటివరకు సమగ్ర విచారణ చేపట్టకపోవడంపై బాధితులు వాపోతున్నారు.
కలెక్టర్‌ను ఆశ్రయిస్తాం
మా తండ్రి వాండ్రాసి అప్పలస్వామికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన పీఏసీఎస్ ఖాతాలో ఉన్న రూ.60 లక్షలను మా అనుమతి, ప్రమేయం లేకుండానే గ్రామానికి చెందిన ఆరుగురి ఖాతాల్లోకి మార్చేశారు. దీనిపై సంఘం చైర్మన్ ప్రసాద్, కార్యదర్శిని నిలదీసినా సమాధానం లేదు. అందుకే ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్‌కు ఫిర్యాదు చేశాం. ఇక్కడ న్యాయం జరగకపోతే జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయిస్తాం.
– వాండ్రాసి కొండలరావు (మృతుడి కుమారుడు)


