అర్ధరాత్రి అదుపుతప్పి
డివైడర్‌ను ఢీకొన్న బైక్
ఇంటర్ విద్యార్థి
అక్కడికక్కడే మృతి
డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలు
అక్కిరెడ్డిపాలెం: ఆ వయసు నవ్వుతూ.. స్నేహితులతో సరదాగా గడపాల్సినది. తల్లిదండ్రుల కళ్లముందు ఉన్నత చదువులు పూర్తి చేసి జీవితంలో స్థిరపడాలని కలలు కనాల్సినది. కానీ క్షణిక నిర్లక్ష్యం, అతి వేగం ఆ కుటుంబాల ఆనందాన్ని చిదిమేసింది. ‘కొద్దిసేపట్లో వస్తాం’ అని కూడా చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరిన ఇద్దరు యువకుల్లో ఒకరు ఇక శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోగా, మరొకరు ఆస్పత్రి మంచంపై ప్రాణాలతో పోరాడుతున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కలచివేశాయి. గాజువాక పోలీసుల వివరాల ప్రకారం.. గాజువాక 70వ వార్డు డ్రైవర్స్ కాలనీకి చెందిన ఎస్.గౌతమ్ (19) డిగ్రీ, జి.బాలమురళీ (18) ఇంటర్మీడియట్ చదువుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చినగంట్యాడ నుంచి పాత గాజువాక వైపు ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. జాతీయ రహదారిపై పాత గాజువాక కూడలి వద్దకు చేరుకోగానే వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో వెనుక కూర్చున్న బాలమురళీ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న గౌతమ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అతి వేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


