
కష్టజీవుల పస్తు!
సేనాని సభ కోసం పేదల పొట్టపై దెబ్బ
పోలీసుల బెదిరింపులతో దుకాణాల బంద్
రోజు కూలి పోయిందని కార్మికుల ఆవేదన
అల్లిపురం: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ‘సేనతో సేనాని’ పేరిట నిర్వహించిన సభ.. ఆ ప్రాంతంలోని కష్టజీవులకు కన్నీటిని మిగిల్చింది. పవన్ రాక సందర్భంగా పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం, తీసుకున్న కఠిన చర్యలు.. రోజు కూలి వస్తే గానీ పూట గడవని వందలాది కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ఈ కార్యక్రమం ‘ఒకరికి మోదం.. మరొకరికి ఖేదం’ అన్న చందంగా సాగింది.
బలవంతంగా దుకాణాల బంద్
సభా వేదికై న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పరిసరాల్లోని దుకాణాలు, వర్క్‌షాపులు, తోపుడు బండ్లను పోలీసులు బలవంతంగా మూయించారు. ‘దుకాణం మూయకపోతే జరిమానా విధిస్తాం’ అంటూ చేసిన హెచ్చరికలతో వ్యాపారులు భయభ్రాంతులకు గురై తాళాలు వేశారు. ‘పని పూర్తి చేసి డెలివరీ ఇవ్వాల్సినవి ఉన్నాయి సార్, ఒక్క గంట సమయం ఇవ్వండి’అని వేడుకున్నా అధికారులు కనికరించలేదని, ‘ఒక్క రోజుకు ఏమీ కాదులే’అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని దుకాణదారులు వాపోయారు. ఈ ఆకస్మిక బంద్ వల్ల రోజువారీ కూలీల పరిస్థితి దారుణంగా మారింది. ‘పని ఉందని ఉదయాన్నే వస్తే, మమ్మల్ని పనిలేకుండా చేశారు. రోజు కూలి చేసుకుంటేనే మా కుటుంబాలు గడిచేది. ఈ రోజు మా పరిస్థితి ఏంటి?’ అంటూ పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పేర్లు చెబితే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకోనివ్వరేమోనన్న భయంతో వారు వివరాలు చెప్పడానికి కూడా నిరాకరించారు. పవన్ రాక తమ లాంటి పేదలకు పస్తులుండేలా చేసిందని వారు ఆవేదన చెందారు.
మీడియాపైనా ఆంక్షలు
సభను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల పట్ల జనసేన నాయకులు, కార్యకర్తల తీరు వివాదాస్పదమైంది. కొందరు జనసేన నాయకులు సీనియర్ పాత్రికేయులను సైతం అడ్డుకుని, ‘మీకు పాసులు ఎవరు ఇచ్చారు? మీకు డీపీఆర్వో అక్రిడిడేషన్ ఉందా?’అంటూ అధికార దర్పం ప్రదర్శించారు. పార్టీ కార్యక్రమానికి, ప్రభుత్వ గుర్తింపు కార్డుకు సంబంధం ఏమిటని ప్రశ్నించినా వినిపించుకోకుండా నానా హంగామా సృష్టించారు. మరోవైపు అసలైన మీడియా ప్రతినిధులను కాదని.. జనసేన కార్యకర్తలు మీడియా పాసులు ధరించి స్వేచ్ఛగా తిరగడం గందరగోళానికి దారితీసింది. ఈ పరిణామాలపై మీడియా వర్గాల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమైంది. మొత్తం మీద ఒక రాజకీయ సభ కోసం సామాన్య ప్రజలను, వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయడం, పోలీసుల సహాయంతో వారి జీవనోపాధిని దెబ్బతీయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

కష్టజీవుల పస్తు!