
స్థానిక నేతలది ప్రేక్షకపాత్రే
జగదాంబ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన ‘సేనతో సేనాని’ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. భారీ అంచనాల మధ్య జరిగిన ఈ సభకు జనం ముఖం చాటేశారు. సభలో స్థానిక నాయకులను పూర్తిగా విస్మరించడం, పోలీసుల మితిమీరిన ఆంక్షలతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
స్థానిక నేతలకు దక్కని ప్రాధాన్యం
ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జరిగిన సేనతో సేనాని కార్యక్రమం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సభలో స్థానిక నాయకులకు ప్రాధాన్యం లేకుండా పోయింది. దక్షిణ నియోజకవర్గం, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లితో పాటు రాష్ట్రంలోని జనసేన ఎమ్మె ల్యేలు, ఎంపీలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం అవుతుందనుకున్న సభ.. ఆరు గంటల వరకు ప్రారంభం కాలేదు. పార్టీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత సభాధ్యక్ష బాధ్యతలు తీసుకున్న దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ మినహా మిగతా వారంతా ప్రేక్షక పాత్ర వహించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా ఏ ఒక్క స్థానిక నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ముందుగా సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఇతర జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలతో పొగడ్తలు గుప్పించడంతో స్థానిక నేతలు తెల్లముఖాలు వేశారు. మరో వైపు జనసేన కార్పొరేటర్లను, పార్టీ మారిన వారిని సభా ప్రాంగణంలో ఓ మూలకు కూర్చోబెట్టడం వారిని మరింత ఇబ్బందికి గురిచేసింది. కనీసం నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. కార్యకర్తను నాయకుడిని చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు.
పోలీసుల ఆంక్షల హంగామా
సేనతో సేనాని కార్యక్రమం కోసం పోలీసులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం స్టేడియం పరిసరాల్లో మోహరించింది. రామకృష్ణ జంక్షన్, రైతుబజార్, టౌన్‌కొత్తరోడ్డు, దుర్గాలమ్మ జంక్షన్, వెలంపేట వంటి కీలక ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి రహదారులను మూసేశారు. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వన్‌టౌన్ సీఐ జీడీ బాబు చేసిన అత్యుత్సాహం తోటి పోలీసులకే విసుగు తెప్పించింది.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశారట!
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా జనసేన ఆపిందని చెప్పిన పవన్ కల్యాణ్.. ప్రస్తుతం చాపకిందనీరులా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కార్యక్రమాలు జరుగుతున్నా సభలో నోరెత్తకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక సభా కార్యక్రమం మధ్యలో తమిళ నటుడు విజయ్ పెట్టిన పార్టీ జెండాలను పవన్ కల్యాణ్ వేసుకోవడంతోపాటు అక్కడ నుంచి వచ్చిన కార్యకర్తలతో ఆ జెండాలను ఆవిష్కరించారు.