
గీతం గుప్పిట్లో ఏయూ?
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో‘గీతం’ పెత్తనం!
ప్రైవేట్ వర్సిటీపై వీసీ అవాజ్య ప్రేమ
సీనియర్లని కాదని రిజిస్ట్రార్‌గా రాంబాబు నియామకం
గతంలో గీతంలో కలిసి పని చేసిన రాంబాబు
అప్పుడు వీసీ, ఇప్పుడు రిజిస్ట్రార్ పేరును సిఫార్సు చేసిన ఎంపీ భరత్
సాక్షి, విశాఖపట్నం: చారిత్రాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంపై ‘గీతం’ పెత్తనం పెరుగుతోందా? విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాల్సిన వర్సిటీని కూటమి ప్రభుత్వం రాజకీయ క్రీడకు వేదికగా మారుస్తోందా? ప్రస్తుత పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా పక్కనే ఉన్న ప్రైవేట్ వర్సిటీ కోసం ఏయూ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించిన టీడీపీ.. ఇప్పుడు మళ్లీ అదే బాటలో పయనిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గీతంలో పనిచేసిన వ్యక్తిని వైస్ చాన్సలర్‌గా నియమించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ తాను ముక్కనే రిజిస్ట్రార్‌గా నియమించడం వివాదాస్పదమవుతోంది. ఏయూ లో ఎంతోమంది సీనియర్లు ఉండగా, వారిని కాదని గీతం వర్సిటీతో సంబంధమున్న వ్యక్తిపై అవాజ్య ప్రేమ చూపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీసీ నియామకం లాగే.. ప్రస్తుత రిజిస్ట్రార్ నియామకం వెనుక ఎంపీ భరత్ సిఫార్సు ఉందన్నది బహిరంగ రహస్యం.
అస్తవ్యస్తంగా ఏయూ పాలన
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అస్తవ్యస్త పాలన కొనసాగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్సిటీని రాజకీయానికి బలి చేస్తున్నారు. గతంలో పనిచేసిన వీసీ, రిజిస్ట్రార్‌లపై బెదిరింపులకు పాల్పడి.. బలవంతపు రాజీనామాలు చేయించిన కూటమి నేతలు.. తమ వారిని ఆ కుర్చీల్లో కూర్చోబెట్టారు. ముఖ్యంగా గీతం యూనివర్సిటీ చైర్మన్, ఎంపీ భరత్ కనుసన్నల్లోనే కీలక పదవుల నియామకాలు జరుగుతుండటం చూస్తుంటే.. విశ్వ విద్యాలయం ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఏయూ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విద్యా బోధన, ఇతర ఏయూ అభివృద్ధిని పక్కనపెట్టేసి.. కుర్చీలాటలాడుకోవడం సర్వత్రా విస్మయానికి గురి చేస్తోంది. నాలుగు రోజుల కిందట ఏయూ రిజిస్ట్రార్ ధనుంజయరావు అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. తమ వ్యక్తిని ఆ పదవిలో నియమించుకోవడం కోసం వీసీ రాజశేఖర్.. ఆయనపై పొమ్మనలేక పొగపెట్టినట్లు తెలుస్తోంది. వీసీ వైఖరి నచ్చకపోవడం, పదవీకాలం ముగియనుండటంతో త్వరగా వైదొలగాలని కూటమి నేతల నుంచి వచ్చిన ఒత్తిడులను తట్టుకోలేకే ధనుంజయరావు రాజీనామా చేశారని సమాచారం. ఆ వెంటనే, ఎంపీ భరత్ మరోసారి చక్రం తిప్పి, గీతం వర్సిటీతో సంబంధం ఉన్న వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోబెట్టేశారు.
వీసీ, రిజిస్ట్రార్.. ఇద్దరూ ‘గీతం’ వారే!
గత వీసీని బలవంతంగా రాజీనామా చేయించిన తర్వాత కూటమి నేతలు ఏయూను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఎంపీ భరత్ ఏయూపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే, గతంలో గీతంలో పనిచేసి, ఆ తర్వాత ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విధులు నిర్వర్తించిన రాజశేఖర్‌ను ఏయూ వైస్ చాన్సలర్‌గా నియమించాలని పట్టుబట్టి మరీ పదవి కట్టబెట్టారు. ఇప్పుడు రిజిస్ట్రార్‌ను అర్థాంతరంగా తొలగించడం వెనుక కూడా భరత్ కుట్ర ఉందన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఏయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా పనిచేస్తున్న రాంబాబు గతంలో గీతంలోనూ విధులు నిర్వర్తించారు. రాంబాబును రిజిస్ట్రార్‌గా నియమించాలని భరత్ సిఫార్సు చేయడంతో, వీసీ ఆయన పేరును ఉన్నత విద్యామండలికి పంపించారు. ఆ తర్వాత ఎంపీ ప్రభుత్వ స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి రాంబాబు నియామకానికి ఆమోదముద్ర వేయించారు. రాంబాబు కంటే ఎంతోమంది సీనియర్లు వర్సిటీలో ఉన్నా, వారందరినీ పక్కనపెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీసీ పూర్తిగా రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తూ విశ్వవిద్యాలయ ప్రతిష్టను మంటగలుపుతున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వర్సిటీ మూలాలు ఏయూలో విస్తరించడం భవిష్యత్తులో విశ్వవిద్యాలయ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చని ఆందోళన సర్వత్రా నెలకొంది.