
రేపటి నుంచి నేవీ మారథాన్‌కు రిజిస్ట్రేషన్లు
విశాఖస్పోర్ట్స్: సాగర తీరం వెంట 10వ వైజాగ్ నేవీ మారథాన్ డిసెంబర్ 14న నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ మారథాన్‌లో భాగంగా 42కే, 21కే, 10కే, 5కే పరుగులను నిర్వహించనున్నారు. శనివారం ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, కమోడోర్ అనిరుధ్ రాయ్, కెప్టెన్ టి.ఆర్.ఎస్.రాయ్, రాహుల్ సంఖ్రియా మారథాన్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ మాట్లాడుతూ ఉత్సాహంగా సాగే ఈ పరుగులో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎక్కువ మందిని ప్రోత్సహించేందుకు నేవీ ప్రత్యేక డిస్కౌంట్‌తో ప్రవేశ రుసుం కల్పించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఐఎన్‌ఎస్ కళింగ సీవో అనిరుధ్ మాట్లాడుతూ మారథాన్‌లో ఏటా పాల్గొనే ఔత్సాహికుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇందులో పాల్గొనే ప్రతి రన్నర్‌కు కిట్, స్నాక్స్, మెడల్ అందజేస్తామన్నారు. రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమవుతాయని, ఆసక్తి ఉన్నవారు వైజాగ్ నేవీ మారథాన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని సూచించారు. అన్ని పరుగులూ ఆర్.కె.బీచ్‌లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వద్ద నుంచి ప్రారంభమవుతాయని, ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. 10కే రన్‌కు 16 ఏళ్లు నిండిన వారు, 21కే, 42కే పరుగుకు కనీసం 18 ఏళ్లు నిండిన వారు అర్హులన్నారు. ఎస్‌బీఐ డీజీఎం రాహుల్ మాట్లాడుతూ వైజాగ్ నేవీ మారథాన్‌కు మరోసారి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.