
ముగిసిన డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన
ఆరిలోవ: ఉమ్మడి విశాఖ జిల్లాలో డీఎస్సీ–2025 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శనివారంతో ముగిసింది. జిల్లాలో 1,426 పోస్టులకు సంబంధించి ఓపెన్ కేటగిరీతో పాటు రిజర్వేషన్ కేటగిరీల మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ పరిశీలన ఈ నెల 28న విశాఖ ఉక్కునగరం విమల విద్యా పరిషత్‌లో ప్రారంభమైంది. మొదటి రెండు రోజుల్లో 1,426 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ రెండు రోజుల్లో హాజరు కాలేకపోయిన వారికి, అలాగే హాజరైనప్పటికీ ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా లేని, చిరునామాలు, పేర్లు తారుమారు అయిన 26 మంది అభ్యర్థులకు శనివారం మరో అవకాశం కల్పించినట్లు డీఈవో ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. వీరంతా సరైన ధ్రువీకరణ పత్రాలతో రావడంతో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఈ అభ్యర్థుల్లో కొందరు రెండు నుంచి నాలుగు పోస్టులకు ఎంపికయ్యే ర్యాంకులు సాధించారని, వారు ఏ పోస్టులకు సానుకూలత చూపుతారో దానిని బట్టి రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన ఉండే అవకాశం ఉందన్నారు.