
పోస్టులు సరే.. అధికారులెక్కడ?
గందరగోళంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ వ్యవహారం ఉన్నతాధికారుల్ని నియమించినట్లు రైల్వే బోర్డు ఉత్తర్వులు జీఎం తప్ప.. విశాఖలో కనిపించని ఇతర అధికారులు ఎవరికీ కార్యాలయాలు లేక బాధ్యతల స్వీకరణకు నో.!
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన వచ్చి ఆరేళ్లు దాటినా, దాని కార్యకలాపాలు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. కాగితాలపై చకచకా పనులు జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ‘ఒక అడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కి’ అన్న చందంగా పరిస్థితి మారిపోయింది. రైల్వే బోర్డు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జనరల్ మేనేజర్‌గా (జీఎం) సందీప్ మాధుర్‌ని రెండున్నర నెలల క్రితం నియమించింది. అదేవిధంగా, పలువురు ప్రిన్సిపల్ అధికారుల్ని కూడా నియమించారు. అయితే జోన్‌కు ఇంకా శాశ్వత కార్యాలయం లేకపోవడంతో జీఎం విశాఖకు అప్పుడప్పుడు వస్తూ పోతున్నారు. మిగతా అధికారులు మాత్రం బాధ్యతలు స్వీకరించడానికి వెనుకంజ వేస్తున్నారు. వీఎంఆర్‌డీఏ ది డెక్, ఇతర రైల్వే భవనాలను తాత్కాలిక కార్యాలయాల కోసం రైల్వే బోర్డుకు పంపినా, ఇంతవరకు ఆమోదం లభించలేదు. దీంతో జీఎం విశాఖ రైల్వే గెస్ట్ హౌస్‌లోనే కాలం వెళ్లదీస్తున్నారు.
ప్రిన్సిపల్ అధికారులను నియమించినా..?
జీఎం నియామకం తర్వాత పలు ప్రిన్సిపల్ పోస్టులను కూడా జోన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇండియన్ రైల్వేస్ మేనేజ్‌మెంట్ సర్వీస్ (ఐఆర్‌ఎంఎస్) నుంచి ఒక ఎలక్ట్రికల్ అధికారిని, సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ నుంచి పీసీఎంఈ (ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్)గా అమిత్ గుప్తాని నియమించారు. కానీ వీరు ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. ఎక్కడ బాధ్యతలు తీసుకోవాలో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది.
కేంద్రంపై ఒత్తిడి తేవాలి..
ప్రయాణికులు, ఉత్తరాంధ్ర ప్రజలు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి వీలైనంత త్వరగా గెజిట్ విడుదల చేయించాలని, తద్వారా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావాలని కోరుకుంటున్నారు.
గెజిట్ విడుదల కీలకం
ఈ దుస్థితికి ప్రధాన కారణం గెజిట్ విడుదల కాకపోవడమేనని వాల్తేరు అధికారులు అంటున్నారు. గెజిట్ విడుదలైన తర్వాతే తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభం కావడం సాధ్యమవుతుంది. గెజిట్‌తో పాటుగా కార్యచరణ ప్రకటిస్తే, జీఎంతో సహా మొత్తం 180 మంది అధికారులు, ఉద్యోగులు నియమితులవుతారు. అప్పుడు మాత్రమే జోన్ కార్యకలాపాలు మొదలవుతాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, దసరా నాటికి కూడా ఈ పనులు పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు.