
వైభవంగా రాధాష్టమి ఉత్సవం
తగరపువలస: ఆనందపురం మండలం, గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠంలో ఆదివారం హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో శ్రీరాధాష్టమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఉదయం 11 గంటలకు శ్రీరాధా మదన్ మోహన మందిరం నుంచి శ్రీరాధాకృష్ణుల విగ్రహాలను సంకీర్తనలతో పల్లకీలో ఊరేగించారు. ఈ ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, పూలతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా, శ్రీరాధా మదన్ మోహనుల విగ్రహాలకు సప్త నదులైన గంగ, యమున, సరస్వతి, గోదావరి, నర్మద, సింధు, కావేరి నదుల జలాలతో అభిషేకం నిర్వహించారు. వీటితో పాటు 108 కలశాలు, పండ్ల రసాలు, పంచామృతాలు, పంచగవ్యాలతో వేద మంత్రాల నడుమ అభిషేకాలు అంగరంగ వైభవంగా జరిగాయి. హరేకృష్ణ మూవ్‌మెంట్ జిల్లా అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస, శ్రీరాధారాణి ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. రాధాదేవి సాక్షాత్తు శ్రీకృష్ణుని అంతరంగిక శక్తి స్వరూపమని, ఆమె ఆరాధనకు ఇది ఒక అపురూప సమయమని అన్నారు. ఈ వేడుకలలో పాల్గొన్న సుమారు 500 మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసినట్లు హరేకృష్ణ మూవ్‌మెంట్ ప్రతినిధి యదురాజ దాస వెల్లడించారు.
సందడిగా పూల అలంకరణ పోటీలు
హరేకృష్ణ వైకుంఠంలో హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం పూలదండలు, పుష్పగుచ్ఛాల అలంకరణ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 12 నుంచి 16 ఏళ్ల బాలబాలికలు, 16 ఏళ్లు పైబడిన మహిళలు కలిపి మొత్తం 112 మంది పాల్గొన్నారు. రాధాష్టమి సందర్భంగా జరిగిన ఈ పోటీలలో, అందరూ ఉత్సాహంగా వివిధ రకాల పూల అలంకరణలు చేశారు. జయంతి దేవివాసికి ప్రథమ బహుమతి(రూ.50వేలు), ద్వితీయ బహుమతి కె.జయలక్ష్మి (రూ.40వేలు), తృతీయ బహుమతి కె.సుధ (రూ.25 వేలు) కై వసం చేసుకున్నారు. వీరికి హరేకృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస అందజేశారు. ఈ పోటీలకు ఫైన్ ఆర్ట్స్ విభాగాధిపతి ఆముక్త మాల్యద న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో
పల్లకీ ఉత్సవం

వైభవంగా రాధాష్టమి ఉత్సవం