
వైద్యశాఖలో పోస్టుల భర్తీ ఎప్పుడు?
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
8 నెలల క్రితం నర్సుల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్
ఇప్పటి వరకూ పోస్టులుభర్తీ చేయని వైనం
ఆందోళన చెందుతున్న నిరుద్యోగులు
మహారాణిపేట: వైద్య ఆరోగ్యశాఖలోనూ, కేజీహెచ్, ఆంధ్ర వైద్య కళాశాల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తోంది. జనవరిలో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం నర్సుల భర్తీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తక్షణం పోస్టులు భర్తీ చేసి తమను ఆదుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌ను (సోమవారం మంత్రి విశాఖ వస్తున్నారు) కోరుతున్నారు.
అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు మాట తప్పారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇది పారదర్శక పాలన కాదని వారు నిలదీస్తున్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతను ఆకట్టుకున్న కూటమి నేతలు, అధికారంలోకి వచ్చి 13 నెలలు గడుస్తున్నా పోస్టుల భర్తీపై ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చి నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఖాళీలు
ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఖాళీగా ఉన్న 106 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత వివిధ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అదనంగా మరో 264 నర్సుల పోస్టులు చేరాయి. వీటితో కలిపి మొత్తం 370 పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయం చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లలో మొత్తం 8,300 దరఖాస్తులు వచ్చాయి. కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలు, కేజీహెచ్, రాణీ చంద్రమతి దేవి ఆస్పత్రి, శ్రీకాకుళం, విజయనగరం, పాడేరు ప్రభుత్వ ఆస్పత్రులు, క్యాన్సర్ వార్డులకు అదనంగా నర్సులు మంజూరు కావడంతో పాటు, పదవీ విరమణ వల్ల ఏర్పడిన ఖాళీలతో కలిపి ఈ 370 పోస్టుల భర్తీకి ప్రక్రియ మొదలు పెట్టారు. అయితే డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన ఆదేశాలతో 246 పోస్టుల భర్తీని నిలిపివేశారు.
టీచింగ్ ఆస్పత్రుల్లోనూ అదే పరిస్థితి
ఆంధ్ర మెడికల్ కాలేజీ, కేజీహెచ్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్స్‌లో మొత్తం 22 కేటగిరీల్లో 71 పోస్టుల భర్తీకి అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానించారు. వీటికి భారీగా దరఖాస్తులు వచ్చినా, ఇంతవరకు ఏ ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. నిరుద్యోగులు ప్రతిరోజూ ఆశగా ఎదురుచూస్తున్నారు.
నర్సుల పోస్టుల భర్తీలో జాప్యం
124 నర్సుల పోస్టుల ఎంపిక జాబితాను విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఈ పోస్టులను వైద్య విధాన పరిషత్, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆస్పత్రుల్లో భర్తీ చేస్తున్నామని తెలిపారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఇతర ఆస్పత్రుల్లో 90 పోస్టులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 34 పోస్టుల భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.