సేఫ్టీలో నంబర్‌ 1 వైజాగ్‌

తెలుగు తల్లి ఫ్లైఓవర్‌  - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరం రోడ్డు సేఫ్టీలో ముందంజలో ఉంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ప్రముఖ నగరాలైన చైన్నె, పాట్నా, ముంబై నగరాలను సైతం పక్కకు నెట్టేసి నంబర్‌ వన్‌ స్థానాన్ని పొందింది. రోడ్డు రవాణ , జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల నివేదికను ఈ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంటుంది. దీని ప్రకారం పది లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల్లో 34.5 శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ద్వారా మన విశాఖ నగరం మొదటిస్థానంలో ఉంది.

2021లో విశాఖ నగరంలో 2,339 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 2022లో 1,531 మాత్రమే జరిగాయి. 2021లో దేశంలో అత్యధిక ప్రమాదాలు జరిగిన 50 నగరాల్లో విశాఖ 2,339 ప్రమాదాలతో ఏడో స్థానంలో నిలిచింది. 2022లో అంతకుముందు సంవత్సరం (1,531 ప్రమాదాలు)తో పోల్చితే 808 ప్రమాదాలు 34.5 శాతంతో 22వ స్థానానికి వెళ్లింది. ఇక 2021లో రోడ్డు ప్రమాదాల్లో 368 మంది (15వ స్థానం) చనిపోగా, 2022లో ఆ సంఖ్య 358కి (18వ స్థానం) తగ్గింది. అలాగే ఈ ప్రమాదాల్లో గాయపడిన వారి సంఖ్య 2021లో 1,533 మంది (14వ స్థానం) కాగా, 2022లో 1,228 (22వ స్థానం)కి తగ్గారు. ఇక ప్రమాదాల తగ్గుదలను పరిశీలిస్తే.. 31.4 శాతంతో చైన్నె రెండో స్థానం, 28.4 శాతంతో పాట్నా మూడో స్థానం, 15 శాతంతో ముంబై నాలుగో స్థానంలో ఉన్నాయి.

అతివేగం ప్రమాదాలే అధికం
విశాఖ నగరంలో 2022లో జరిగిన అత్యధిక రోడ్డు ప్రమాదాలకు అతివేగమే కారణమని ఆ నివేదిక తేల్చింది. మొత్తం 1,531 ప్రమాదాల్లో 1,228 (83.14 శాతం) అతివేగం వల్లే జరిగాయని పేర్కొంది. ఈ ప్రమాదాల్లో 301 మంది మరణించగా 1,842 మంది గాయపడ్డారు. అలాగే రాంగ్‌ రూట్‌లో వాహనాలను నడపడం ద్వారా జరిగిన 27 ప్రమాదాల్లో తొమ్మిది మంది మృత్యువాత పడగా, 26 మంది గాయపడ్డారు. ప్రమాదాల్లో అత్యధికంగా 1,017 సరళ రహదారిపైన, 111 ప్రమాదాలు రోడ్ల మలుపుల్లో, 473 జంక్షన్ల వద్ద, 11 కల్వర్టులపైన జరిగాయి. ద్విచక్ర వాహన ప్రమాదాల సంఖ్య అధికంగా ఉంది. 791 బైక్‌ ప్రమాదాల్లో 179 మంది చనిపోగా, 748 మంది గాయపడ్డారు. 51 ఆటో ప్రమాదాల వల్ల 13 మంది, 30 లారీ ప్రమాదాల్లో ఏడుగురు, 18 బస్సు ప్రమాదాల్లో నలుగురు, 418 ప్రమాదాల్లో 105 మంది పాదచారులు, ఇతర ప్రమాదాల్లో మరో 50 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక ఈ ఏడాది కూడా రోడ్డు ప్రమాదాల తగ్గుదల గణనీయంగానే ఉంది. 2022 ఆగస్టు వరకు 1,226 ప్రమాదాలు జరగ్గా ఈ ఏడాది ఆగస్టు ఆఖరు వరకు 766 రోడ్డు ప్రమాదాలు (37.52 శాతం తక్కువ) మాత్రమే జరిగాయి. ఇక మరణాల సంఖ్యను చూస్తే 2022 ఆగస్టు వరకు 362 మంది చనిపోగా, ఈ ఏడాది అదే సమయానికి 207 మంది (42.8 శాతం తక్కువ) మృత్యువాత పడ్డారు.

సంయుక్త తనిఖీలతో సత్ఫలితాలు
రవాణ , పోలీసు, జీవీఎంసీ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సంయుక్తంగా తరచూ ముమ్మర తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నాం. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ఓవర్‌ స్పీడ్‌, నిబంధనల ఉల్లంఘనపై రోజూ కేసులు నమోదు చేస్తున్నాం. ఒక్క డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులే 4200కి పైగా నమోదు చేశాం. రోడ్డు ప్రమాదాలపై జంక్షన్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ల్లో సత్వరమే ఆస్పత్రులకు తరలిస్తున్నాం. వీరిని రక్షించిన వారికి రూ.5 వేలు రివార్డు ఇస్తున్నాం. ‘విజన్‌ జీరో’ నినాదంతో పనిచేస్తున్నాం. రోడ్ల విస్తరణ, స్పీడ్‌ బ్రేకర్లు, సిగ్నల్స్‌ ఏర్పాటుకు రూ.21 కోట్లు వెచ్చించాం. ఇవన్నీ వెరసి విశాఖలో రోడ్డు ప్రమాదాలు, మరణాల తగ్గుదల సాధ్యమైంది.
– జీసీ రాజారత్నం, డీటీసీ, విశాఖపట్నం

ప్రమాదాల తగ్గుదలలో దేశంలో విశాఖ టాప్‌

ఏడాదిలో 34.5 శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాలు

ఆ తర్వాత స్థానాల్లో చైన్నె, పాట్నా, ముంబై

2021లో 2,339 ప్రమాదాల్లో 368 మంది మృత్యువాత

2022లో 1,531 యాక్సిడెంట్లలో 358కి తగ్గిన మరణాలు

రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ నివేదిక వెల్లడి

రెండేళ్లలో రోడ్డు ప్రమాదాల వివరాలు ఇలా..

సంవత్సరం ప్రమాదాలు మరణాలు గాయాలు

2021 2,339 368 1,533

2022 1,531 358 1,288

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top