తూకాల్లో నొక్కుడు
చర్చ్చిలో ఆకట్టుకున్న సెట్టింగ్‌లు
ట్రినిటీ లూథరన్ చర్చిలో బుధవారం అర్ధరాత్రి క్రైస్తవుల ప్రార్థనలు
బియ్యం పంపిణీలో రేషన్ డీలర్ల చేతివాటం
అల్లిపురం ప్రాంతంలో ఓ మహిళ చౌక దుకాణం నుంచి బియ్యం తీసుకువెళ్లింది. ఇంటికి వెళ్లి తూకం వేయగా 15 కిలోలకుగాను 13.50 కిలోలే వచ్చాయి. వెంటనే వెళ్లి డీలర్‌ను ప్రశ్నించింది. ఆయన బియ్యం బస్తాను తూకం చూడగా 47.600 కిలోలు వచ్చింది.
మధురవాడ వాంబేకాలనీలోని ఓ డిపోలో బియ్యం తూకంలో తేడా రావడంతో లబ్ధిదారుడు డీలర్‌తో గొడవకు దిగాడు. కావాలంటే సరుకు తీసుకెళ్లు.. లేదంటే అక్కడ పడేసి వెళ్లాలంటూ డీలర్ దబాయించాడు. దీంతో చేసిది లేక లబ్ధిదారుడు ఉన్న సరుకుతో ఇంటికెళ్లాడు.
మహారాణిపేట: జిల్లాలో చౌకదుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యంలో అవకతవకలు జరుగుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. డీలర్లు తూకాల్లో మోసాలకు పాల్పడుతుండటంతో అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయమై డీలర్లను ప్రశ్నిస్తే.. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచే తూకాలు తక్కువతో సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. వీటిని పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 612 చౌకధరల దుకాణాల షాపుల్లో మొత్తం 5,17,155 కార్డులకు గాను 8,161 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయిస్తోంది. కార్డులో ఉన్న కుటుంబ సభ్యుడికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బియ్యం తూకాల్లో మోసాలు జరుగుతుండటంతో కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిల్వ కేంద్రాల్లోనూ తక్కువగా..
ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని గోదాముల నుంచి డీలర్లు తీసుకొని చౌక ధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు సరఫరా చేస్తారు. విశాఖ జిల్లాలో రెండు సర్కిళ్లకు సంబంధించి మర్రిపాలెం ఎఫ్‌సీఐ గోదాం, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, గాజువాక మండలాల డీలర్లు వారి పరిధిలో ఉన్న ఎంఎల్‌ఎస్ పాయింట్స్ నుంచి బియ్యం తీసుకుంటున్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్స్, మర్రిపాలెం గోదాంల నుంచి వస్తున్న బియ్యంలో పెద్ద తేడా కనపడుతోంది. ఇక్కడ నుంచి 50 కిలోల బస్తా తీసుకుంటే 47.60 కిలోలే వస్తోందని డీలర్లు వాపోతున్నారు. ఈ భారాన్ని డీలర్లు కార్డుదారుల మీదకు నెడుతున్నారు. తూకాల్లో తేడాలు వస్తే నిల్వ కేంద్రాల్లో డీలర్లు బియ్యం తీసుకునేటప్పుడు ఎందుకు అడగడం లేదని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. బియ్యం తూనికల్లో తేడా వస్తున్నాయని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
నేరుగా బ్లాక్ మార్కెట్లు
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డీలర్లను మార్పు చేశారు. తమకు అనుకూలంగా ఉన్నోళ్లకు డీలర్‌షిప్ ఇవ్వడంతో అవినీతి దందాకు తెరలేపారు. కూటమి పార్టీల నాయకుల కనుసన్నల్లోనే తూకాల్లో తేడా నిర్వాకం జరుగుతోందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. డీలర్ల నుంచి మిగిలిన సరుకును నేరుగా బ్లాక్ మార్కెట్‌కు గుట్టు చప్పుడు కాకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
మామూళ్ల మత్తులో అధికారులు
తూకాల్లో వ్యత్యాసాన్ని పరిశీలించాల్సిన తూనికలు కొలతల అధికారులు మామూళ్ల మత్తులో కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. ఆర్నెళ్లకు ఓసారి కూడా తనిఖీలు చేయడం లేదు. మరోవైపు పౌరసరఫరాల శాఖాధికారులు ఎలాంటి తనిఖీలు చేయకపోవడంతో డీలర్లు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. అలాగే గోదాముల్లోను, ఎంఎల్‌ఎస్ పాయింట్లల్లో తనిఖీలు చేయకపోవడంపై మరోవైపు డీలర్లు ప్రశ్నిస్తున్నారు.


