పెప్పర్ స్ప్రే కొట్టి భర్తపై భార్య దాడి
విశాఖ సిటీ: తన భార్య, కుమార్తె, ఆమె స్నేహితుడు తనపై పెప్పర్ స్ప్రే కొట్టి, దాడికి పాల్పడ్డారని దీపాటి జార్జ్ మార్టిన్ అనే వ్యక్తి మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు.. మార్టిన్(56) భార్య హన్నా మార్టిన్, ఇద్దరు పిల్లలతో పాండురంగాపురం ప్రాంతంలో నివాసముంటున్నారు. భార్య పేరు మీద ఒక ఇంజనీరింగ్ కంపెనీని ప్రారంభించి, కాంట్రాక్టు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల నుంచి భార్య హన్నా మార్టిన్ ఆ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆయన చేసిన కాంట్రాక్టు పనుల బిల్లులు సదరు కంపెనీ అకౌంట్‌లోనే పడడంతో వాటిని తీసుకునే అవకాశం మార్టిన్‌కు లేకుండా పోయింది. నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన మార్టిన్ తన తల్లి, కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. మంగళవారం పని మీద ఇంటికి వెళ్లడంతో అక్కడ భార్య, కుమార్తె, అమె స్నేహితుడు మార్టిన్‌పై పెప్పర్ స్ప్రే కొట్టి దాడి చేశారు. అతడి కాలు, చేతికి గాయాలవడంతో కేజీహెచ్‌లో చికిత్స చేయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


