వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో క్రైస్తవులకు మేలు
సాక్షి, విశాఖపట్నం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో క్రైస్తవులకు మేలు జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్‌వెస్లీ అన్నారు. బుధవారం మద్దిలపాలెంలో గల జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా చర్చి పాస్టర్‌లకు ప్రతీ నెల రూ.5000 గౌరవ వేతనం ఇచ్చామన్నారు. క్రైస్తవుల సంక్షేమం కోసం రూ.416 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం క్రైస్తవులకు గౌరవ వేతనం ఇవ్వకుండా కాలక్షేపం చేయడమే కాకుండా.. క్రైస్తవులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ క్రైస్తవ్యం అంటేనే శాంతి, కరుణ, దయ, జాలి అన్నారు. క్రైస్తవులందరూ కృతజ్ఞత కలిగి ఉండే వ్యక్తులని తెలిపారు. మహానేత వైఎస్సార్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో మతాలు, కులాలకతీతంగా సుపరిపాలనను అందించారని, అందుకే తెలుగు ప్రజలంతా గుండెల్లో సుస్థిర స్థానం పొందారన్నారు. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ క్రైస్తవ్యం అంటేనే సేవకు చిహ్నమని తెలిపారు. ప్రతి ఒక్కరూ పొరుగు వారిని ప్రేమించమని యేసు క్రీస్తు చెప్పిన మాటలను అనుసరిస్తే ఈ ప్రపంచం శాంతిమయంగా మారుతుందన్నారు.
మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ తాను క్రైస్తవ మిషనరీ స్కూళ్లలో చదవడం వల్ల ఎంతో క్రమశిక్షణ నిజాయితీ అలవడిందని, ఆ ప్రేరణతోనే రాజకీయాల్లోకి రావడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రవిబాబు, బిషప్ ఎంఏ పాల్, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, సీహెచ్ వెంకటరామయ్య, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్ కె.సతీష్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీలు ఎంఏ పాల్ సుధాకర్, గరికిముక్కల పాల్ విక్టర్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు చింతాడ శ్రీనివాసరావు, ప్రభాకర్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకుడు నిడిగట్టు రాజశేఖర్, జిల్లా సెక్రెటరీ కందిమల్ల రాజశేఖర్, పాస్టర్స్ పాల్గొన్నారు.


