మట్టి పన్ను కట్టం.. ఏం చేసుకుంటారో చేసుకోండి!
రెండో రోజు ఏఎంఆర్ కంపెనీ సిబ్బందిపై తిరుగుబాటు
చీడిగుమ్మలలో ట్రాక్టర్ యజమానుల ఆందోళన
ప్రభుత్వ తీరుపై జనం మండిపాటు
గొలుగొండ: ఏఎంఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిబ్బందికి మట్టి పన్ను కట్టం..ఏం చేసుకుంటారో చేసుకోండి.. పేదలకు ప్రభుత్వం న్యాయం చేయకుండా మట్టిపై ఎలా పన్ను కట్టగలమని చీడిగుమ్మల గ్రామంలో సుమారుగా 100 మంది వరకు రైతులు, కూలీలు, ట్రాక్టర్ యజమానులు ఆందోళన చేశారు. వివరాలిలా ఉన్నాయి. చీడిగ్ముమల గ్రామంలో బుధవారం ఉదయం ట్రాక్టర్ యజమానులు, ఇటుక బట్టీ కూలీలు ట్రాక్టర్లపై పొలంతో మట్టి తీసుకు వస్తున్న సమయలో ఏఎంఆర్ సంస్ద ప్రతినిధులు ట్రాక్టర్‌కు రూ.405 పన్ను చెల్లించాలని డిమాండ్ చేశారు. పునాదులు, ఇటుక తయారీకి పొలంలో మట్టి తీసుకు వెళుతున్నామని, దీనిపై ఇంత మొత్తంలో డబ్బులు చెల్లించలేమని వారు బదులిచ్చారు. అయితే డబ్బులు కడితేనే తప్ప ట్రాక్టర్లు వెళ్లడానికి వీలు లేదని సంస్ధ సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో పోలవరం, చీడిగుమ్మల, ఎరకంపేట, అయ్యన్నపాలెం, ఎర్రవరం, ఏఎల్‌పురంకు చెందిన ట్రాక్టర్ యజమానులంతా ఐక్యంగా ఆందోళనకు దిగారు. మట్టి తరలించడం ఆపడం కుదరదన్నారు. చిన్న ఇల్లు కట్టుకొనే సమయంలో ఈ పన్ను కడితే కనీపం పునాదికి రూ.60 వేల వరకు ఖర్చవుతుందని, ఇక పేదవారు ఇల్లు ఎలా కట్టుకోగలరని అన్నారు. రైతులు, ఇటుక కూలీల పక్షాన చీడిగుమ్మల గ్రామ టీడీపీ అధ్యక్షుడు కామిరెడ్డి గోవింద్ నిలబడి ఏఎంఆర్ సంస్థ వల్ల పేదలకు ఎంతో అన్యాయం జరుగుతోందన్నారు. ఈఏఎంఆర్ సంస్థ ప్రతి గ్రామంలో సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ఈ మట్టిపై పన్ను వసూళ్లు చేయడం పట్ల ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కార్ చేస్తున్న ఈ దందాను తక్షణం అపాలని డిమాండ్ చేశారు. కాగా రైతుల అవసరం కోసం మట్టి తరలించడానికి మండల తహసీల్దార్ నుంచి అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలని ఇన్‌చార్జి జియాలజిస్టు వెంకటరావు తెలిపారు. ఈ వివాదం పెద్దది కావడంతో ఆయన ఈ గ్రామాన్ని సందర్శించారు. రైతులు మట్టి తీస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నాకే మట్టి తరలించుకోవాలని, ప్రస్తుతం మట్టి తరలింపు ఆపాలని సూచించారు.


