వేగవంతంగా విద్యా రుణాలు
తుమ్మపాల: తల్లిదండ్రుల సిబిల్ స్కోర్ చూడకుండా వేగంగా విద్యా రుణాలు మంజూరు చెయ్యాలని కలెక్టర్ విజయ కృష్ణన్ బ్యాంక్ అధికారులకు సూచించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ (డీసీసీ), బ్యాంకు రుణాలపై జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) 2వ త్రైమాసిక జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌలు రైతులకు, సూర్య ఘర్ సోలార్ రూఫ్‌టాప్‌కు, పరిశ్రమలకు వ్యవసాయ, డెయిరీ, పౌల్ట్రీ ఉపాధి రంగాలకు స్వయం సహాయక బృందాలకు త్వరతగతిన రుణాలు మంజూరు చేసి లక్ష్యాలకు మించి రుణాలు అందించాలన్నారు. విద్యా రుణాలకు, యువతకు స్వయం ఉపాధి పథకాల మంజూరుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకు అధికారులకు తెలిపారు. జిల్లాలో బ్యాంకులు లక్ష్యాలను మించి రుణాలు మంజూరు చెయ్యాలని తెలిపారు. నిరర్థక బ్యాంకు ఖాతాలలో గల నగదుకు సంబంధికులను గుర్తించి అందజేయాలని తెలిపారు. పశు సంవర్ధక, డెయిరీ, మత్స్య పరిశ్రమలలో కాలానుగుణంగా ఉత్పత్తి సాధించే రంగాలకు ఆర్ధిక చేయూతనివ్వాలన్నారు. ఆయా శాఖల అధికారులు బ్యాంకు అధికారులు సమన్వయంతో వ్యవసాయ, అనుబంధ రంగ రైతులను, స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించాలన్నారు. కౌలు రైతులకు కూడా వ్యవసాయ రుణాలు అందించాలని, ఈ–క్రాప్ ఆధారంగా వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు అందించాలని తెలిపారు. జిల్లాలో ఉత్పత్తి అవుతున్న వస్తువులకు బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కె.సత్యనారాయణ గత సమావేశంలో చర్చించిన విషయాలపై తీసుకున్న చర్యలను, రుణ ప్రణాళిక అమలు నివేదికను పవర్ పాయిఐట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ జితేంద్ర శర్మ, ఆర్‌బీఐ ఎల్‌డీవో నవీన్ కుమార్, ఏపీజీబీ రీజనల్ మేనేజర్ సతీష్, డీఆర్‌డీఏ పీడీ కె.శచీదేవి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి మోహన్‌రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.


