అతి వేగంతో అనర్థం..
యలమంచిలి రూరల్: మితిమీరిన వేగం, ట్రిపుల్ రైడింగ్ కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందగా, ఐదుగురు గాయపడ్డారు.ఈ విషాదకర ఘటన యలమంచిలి పట్టణం అయ్యప్పస్వామి ఆలయానికి సమీపంలో ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం జరిగింది. ఇక్కడ రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ముగ్గురు యువకులతో అతివేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు, ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. యలమంచిలి మండలం రేగుపాలెంకు చెందిన రాజాన సాయి తేజ(23), రాజాన గౌతమ్(17), పక్కుర్తి కార్తీక్ (17) బుధవారం సాయంత్రం తమ గ్రామం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో యలమంచిలి పట్టణానికి వచ్చారు. తిరిగి రేగుపాలెం వెళ్తుండగా మితిమీరిన వేగంతో బైక్ నడుపుతూ వెళ్లి ఆటోను ఢీకొట్టారు. బైకు నడుపుతున్న రాజాన సాయితేజతో పాటు మిగిలిన ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలంలోనే సాయితేజ తల నుంచి తీవ్రంగా రక్తస్రావమైంది. ఆటోలో ఉన్న జి.యేసు, కె.భారతి, ఎ.నూకరాజు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులందరికీ ఆటోల్లో యలమంచిలి సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ముగ్గురు యువకుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు వైద్యాధికారి నిహారిక తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ రాజాన సాయితేజ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మిగిలిన ఇద్దరు యువకులు చికిత్స పొందుతున్నారు.
అతి వేగంతో అనర్థం..


