ఆశల దీపం ఆరిపోయింది | - | Sakshi
Sakshi News home page

ఆశల దీపం ఆరిపోయింది

Jun 24 2023 11:14 AM | Updated on Jun 24 2023 11:20 AM

- - Sakshi

గంభీరం రిజర్వాయర్‌లో మునిగి ఓ ఎంటెక్‌ విద్యార్థి మృతి చెందాడు. చేతికి అందొచ్చిన కుమారుడు అర్ధంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడంటూ

ఆనందపురం: ఓ ఇంటి ఆశల దీపం ఆరిపోయింది. గంభీరం రిజర్వాయర్‌లో మునిగి ఓ ఎంటెక్‌ విద్యార్థి మృతి చెందాడు. చేతికి అందొచ్చిన కుమారుడు అర్ధంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడంటూ ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమై రోదిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.నగరంలోని జడ్జి కోర్టు పక్కన పితాని వీధికి చెందిన బడిగంటి సూర్యప్రకాష్‌, సీతాలక్ష్మి దంపతులకు బాల సురేంద్ర, భాను శివయశ్వంత్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సూర్యప్రకాష్‌ టైలరింగ్‌ వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. సీతాలక్ష్మి గృహిణి.

బాల సురేంద్ర(24) ఆంధ్రా యూనివర్సిటీలో ఎంటెక్‌ మొదట సంవత్సరం, భాను శివ యశ్వంత్‌ డిగ్రీ చదువుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా సురేంద్ర రెండో పూట ఓ రెస్టారెంట్‌లో రూ.20 వేలు జీతానికి పని చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి సురేంద్ర, రెస్టారెంట్‌ యజమాని, మరో ఐదుగురు స్నేహితులు జీపులో బయలుదేరారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో గంభీరం రిజర్వాయర్‌ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కొంత సేపు కాలక్షేపం చేసి అందరూ గంభీరం రిజర్వాయర్‌లోకి ఈతకు దిగారు.

గతంలో రిజర్వాయర్‌ గర్భంలోని మట్టిని తరలించగా పెద్ద గోతులు ఏర్పడ్డాయి. అవి ఊబిగా మారాయి. ఈతకు దిగిన వారిలో బాల సురేంద్ర మునిగిపోయాడు. అతను ఎంతకు బయటకు రాకపోవడంతో తోటి స్నేహితులు కేకలు వేశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులతో పాటు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సీఐ రామచంద్రరావు, ఎస్‌ఐలు శ్యామ్‌సుందర్‌, నరిసింహమూర్తి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈతగాళ్లను తీసుకొని వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం బాల సురేంద్ర మృతదేహం ఊబిలో కూరుకుపోయి ఉండడాన్ని గుర్తించి బయటకు తీశారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసును సీఐ ఆధ్వర్యంలో ఎస్‌ఐ నర్సింహమూర్తి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement