ఇబ్రహీంపట్నం రూరల్: పౌష్టికాహారంతో ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం ‘మన అంగన్‌వాడీ –మన బాధ్యత’ పేరిట 9వ జాతీయ పోషణ మాసం థీమ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అక్టోబర్ 8వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం కీలమని తెలిపారు. ప్రతి రోజు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, తగినంత ప్రొటీన్‌తో కూడిన ఆహారం తీసుకునేలా కుటుంబాల్లో అవగాహన కల్పించాలన్నారు. అంగన్‌వాడీ సెంటర్లు కేవలం పోషకాహారం అందించే కేంద్రాలు మాత్రమే కాకుండా ప్రాథమిక విద్య, బాలల సమగ్ర అభివృద్ధి, ఆరోగ్యం, పోషణకు కీలకంగా మారాయని చెప్పారు. పోషణ మాసం సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి శాంతిశ్రీ మాట్లాడుతూ.. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాజెక్టుల పరిధిలో పోషకాహారం, ఆహార వైవిధ్యం, ఆరోగ్యంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ అఽధికారి వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సూర్యరత్న, అర్‌అండ్‌బీ ఈఈ రమేష్, సీడీపీఓలు వెన్నెల, కాంతిరేఖ, రేణుక, హసీబా, కవిత, ఉదయ, పోషణ్ అభియాన్ జిల్లా సమన్వయకర్త శ్రీనివాస్, బ్లాక్ కో ఆర్డినేటర్లు శ్రీనివాస్, యాదగిరి, సూపర్ వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, కిషోర బాలికలు పాల్గొన్నారు .
రంగారెడ్డి అదనపు కలెక్టర్ కిరణ్మయి


