కడ్తాల్: నిరంతర విద్యుత్ కోసం రైతన్నలు రోడ్డెక్కారు. సర్పంచ్‌ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొప్పిడి గోపాల్ ఆధ్వర్యంలో రావిచేడ్ సబ్ స్టేషన్ ఎదుట కడ్తాల్– షాద్‌నగర్ ప్రధాన రహదారిపై రావిచేడ్, మక్తమాధారం, న్యామతాపూర్ గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, రోజుకు ఆరు గంట లు కూడా సరఫరా కావడం లేదని అన్నారు. వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. అప్పు చేసి సాగు చేసిన పంటలు కరెంట్ కోతలతో కళ్ల ముందే ఎండిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని మండిపడ్డారు. వెంటనే వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తా మని హెచ్చరించారు. ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, సింగిల్‌విండో చైర్మన్ గంప వెంకటేశ్‌గుప్తా, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్‌నాయక్, సర్పంచ్‌ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరెడ్డి తదితరులు మద్దతు పలికా రు. అనంతరం ట్రాన్స్‌కో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పలువురు సర్పంచ్‌లు, రైతు నాయకులు పాల్గొన్నారు.
నిరంతర విద్యుత్ కోసం రోడ్డెక్కిన అన్నదాతలు


