ఇళ్లకు దళారుల చీడ! | - | Sakshi
Sakshi News home page

ఇళ్లకు దళారుల చీడ!

Sep 23 2026 8:27 AM | Updated on Sep 23 2026 8:27 AM

డబుల్‌ బెడ్‌రూం, ఇందిరమ్మ టవర్స్‌లో ఇల్లు ఇప్పిస్తామంటూ వసూళ్ల పర్వం

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇందిరమ్మ ఇళ్లను దళారుల చీడ పట్టిపీడిస్తోంది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో ఉన్న పరిచయాలను సాకుగా చూపించి పేదల్లో ఉన్న అమాయకత్వాన్ని ‘క్యాష్‌’ చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఇందిరమ్మ టవర్స్‌లో ప్లాట్లు ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారు. ఇళ్ల కోసం ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తు సహా ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటర్‌ ఐడీ, బ్యాంకు ఖాతా పాసుబుక్‌లను సేకరిస్తున్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఓ కుల సంఘానికి చెందిన ముగ్గురు నాయకులు సహా మరి కొంతమంది స్థానిక మాజీ కార్పొరేటర్లు, పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులను సేకరించి, ఇళ్ల కేటాయింపుల కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని ఎరుకల నాంచారమ్మ బస్తీ, నందనవనం, నాగోల్‌–తట్టి అన్నారం సహా శేరిలింగంపల్లి, మహేహేశ్వరం, రాజేంద్రనగర్‌లో దళారుల బెడద ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. హౌసిసంగ్‌, రెవెన్యూ అధికారుల పేరు చెప్పి అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు లేకపోలేదు.

బిల్లులు ఇప్పిస్తామని నమ్మించి

ఇందిరమ్మ ఇళ్లపథకం మొదటి విడతలో భాగంగా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేయాలని భావించి, చివరకు జిల్లాలోని ఎనిమిది నియోజవర్గాలకు 15,603 ఇళ్లకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. వీటిలో ఇప్పటి వరకు 4,485 ఇళ్లు పూర్తయ్యాయి. మరో 5,162 స్లాబ్‌ పూర్తి చేసుకున్నాయి. 823 రూఫ్‌ లెవల్‌ దాటాయి. 1,503 బేస్మెంట్‌ లెవల్‌కే పరిమితమయ్యాయి. 3,630 ఇళ్లు మార్కింగ్‌ పూర్తి చేసుకున్నాయి. వీటిలో 2,113 మంది ఇప్పటికీ పనులు మొదలు పెట్టలేదు. లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే రూ.340 కోట్లు జమ చేశారు. ఇంటి బిల్లులు ఇప్పిస్తామని చెప్పి కొంత మంది మధ్యవర్తులు లబ్ధిదారులను మోసం చేస్తున్నారు. హౌసింగ్‌ విభాగంలోని అధికారులతో తమకు పరిచయాలు ఉన్నాయని నమ్మబలికి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి సైతం వెళ్లింది. మోసగాళ్లపై కేసు నమోదుకు వెనుకాడుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘డబుల్‌’ దళారులు

జిల్లాలోని మల్లాపూర్‌, గౌరెల్లి, మన్సాన్‌పల్లి, తట్టి అన్నారం, ఎరుకల నాంచారమ్మ, నందనవనం తదితర ప్రాంతాల్లో 6,166 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించారు. వీటిలో కొన్ని ఇప్పటికే లబ్ధిదారులకు అందజేశారు. మరికొన్ని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. 3,600 మంది దరఖాస్తులను పరిశీలించగా 1,500 మంది అర్హత సాధించినట్లు అధికారులు చెబుతున్నారు. వీటి కేటాయింపులోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనర్హులకు ఇళ్లను కట్టబెడుతున్నారనే ఫిర్యాదులు సైతం లేకపోలేదు. అధికారులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు.

అమాయకత్వాన్ని ‘క్యాష్‌’ చేసుకుంటున్న అక్రమార్కులు

ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు?

పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సేకరించి అధికారులపై ఒత్తిడి

ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణం ఇలా..

నియోజకవర్గం ప్రాంతం ప్లాట్లు

రాజేంద్రనగర్‌ మైలార్‌దేవ్‌పల్లి 480

మహేశ్వరం జల్‌పల్లి 480

శేరిలింగంపల్లి రాయదుర్గం 480

ఇబ్రహీంపట్నం బండ్లగూడ 480

ఎల్బీనగర్‌ భాగ్‌హయత్‌నగర్‌ 10 ఎకరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement