సమస్యలను పరిష్కరిస్తాం
● డంపింగ్‌యార్డులో నిరంతరం పొగలు
● కాలనీల్లో ఎక్కడికక్కడే పేరుకుపోతున్న చెత్త
● అరకొరగా తడి, పొడి చెత్త సేకరణ
శంకర్‌పల్లి: మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పలు కాలనీల్లో నిత్యం చెత్త సేకరణ జరగకపోవడంతో పెద్ద ఎత్తున ఈగలు, దోమలతో పాటు దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు సరైన డంపింగ్ యార్డు లేకపోవడం, ఉన్న దాంట్లో ఆకతాయిలు చెత్తకు నిప్పు పెడుతుండడంతో నిరంతరం పొగలు వ్యాపిస్తున్నాయి.
ప్రారంభమైందిలా...
శంకర్‌పల్లి మున్సిపాలిటీ 2018లో ఐదు గ్రామాల (శంకర్‌పల్లి, సింగాపూర్, బుల్కాపూర్, రామంతాపూర్, ఫత్తేపూర్) కలయికతో ఏర్పడింది. పారిశుద్ధ్య నిర్వహణ కోసం గతంలో పని చేస్తున్న పంచాయతీ సిబ్బందికి తోడు.. పలువురిని ప్రైవేటుగా తీసుకొని చెత్త సేకరణ చేస్తున్నారు. మున్సిపాలిటీలో నిత్యం 10 నుంచి 12 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ప్రధాన రహదారులు, ముఖ్యమైన ప్రదేశాల్లో నిత్యం చెత్త సేకరణ జరగుతున్నా, మిగతా ప్రాంతాల్లో జరగడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. కాలనీల్లోని రోడ్లపై ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోవడంతో ఈగలు, దోమలు, దుర్వాసనతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటున్నారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత
మున్సిపాలిటీలో ప్రస్తుతం నిత్యం చెత్తను సేకరించడానికి 57మంది కార్మికులు శ్రమిస్తున్నారు. వీరిలో 35 మంది రెగ్యులర్ కార్మికులు ఉండగా.. మిగిలిన 22 మంది ప్రైవేటుగా పని చేస్తున్నారు. మున్సిపాలిటీకి సొంతంగా 9 స్వచ్ఛ ఆటోలు, 4 ట్రాక్టర్లు, 4 ప్రైవేటు ఆటోలు చెత్త సేకరణ చేస్తున్నాయి. మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం ప్రతి 10 వేల జనాభాకి 28 మంది కార్మికులు ఉండాలి. శంకర్‌పల్లిలో 30వేలకు పైగానే జనాభా ఉండగా అనుగుణంగా కార్మికులు లేకపోవడవంతో పారిశుద్ధ్య నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
చెత్తను వేరు చేయకుండానే..
తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యా రు. నిత్యం ఎక్కడా చెత్తను వేరు చేయకుండా నేరుగా డంపింగ్ యార్డుకి తరలిస్తున్నారు. కూరగాయాల మార్కెట్‌లోని వ్యర్థాలను మాత్రం ఎరువుగా తయా రు చేస్తున్నారు. నిత్యం 1 నుంచి 1.5టన్నుల ఎరువు ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నా రు. ఇదే స్ఫూర్తిలో పట్టణంలోని చెత్తను ఎరువుగా మార్చాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
డంపింగ్ యార్డు సమస్య
మున్సిపాలిటీకి ఉన్న అతిపెద్ద సమస్య డంపింగ్ యార్డు. ప్రస్తుతం రెండెకరాల స్థలంలో డంపింగ్ చేస్తున్న స్థలం ప్రభుత్వానికి కాదని, ప్రైవేటు స్థలమని కొందరు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో డంపింగ్‌ని ఎక్కడికి మార్చాలో తెలియక మున్సిపల్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మున్సిపాలిటీలో ఎక్కడా ఎకరం ప్రభుత్వ స్థలం లేకపోవడమే. ఇతర ప్రాంతాల్లో అసైన్డ్ భూములను పరిశీలించినప్పటికీ వాటిని ఇచ్చేందుకు రైతులు సముఖంగా లేరు. ప్రస్తుత డండింగ్ యార్డులో కొందరు ఆకతాయిలు చెత్తకు నిప్పు పెట్టడంతో పెద్ద ఎత్తున నిరంతరం పొగలు వెలువడుతున్నాయి. కిలోమీటర్ల మేర పొగలు వ్యాపిస్తుండడంతో చుట్టూ పక్కల కాలనీల ప్రజలు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపాలిటీలో తడి, పొడి చెత్త సేకరణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాం. కొన్ని ప్రాంతాల్లో మార్పు రావాలి. దీనిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సేకరణ చేపడుతాం. ఉన్నతాధికారులు, చైర్మన్ సహకారంతో డంపింగ్‌యార్డు సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తాం.
– యోగేశ్, మున్సిపల్ కమిషనర్


