ఆరోగ్యశాఖకు
కేసులు నమోదైన ఆర్‌ఎంపీల నుంచి వసూళ్లు
వికారాబాద్: ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు అంటుకుంది. అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ శాఖలోని కొందరు అధికారులు డబ్బులు తీసుకొని ప్రైవేటు ఆస్పత్రులకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల దనదాహంతో ఆ శాఖ ఉద్యోగులు, మెడికల్ ఆఫీసర్లు విసిగిపోతున్నారు. సొంత శాఖలోనూ బాధితులు ఉన్నారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఏ ఫైలు కదలాలన్నా ముడుపులు ముట్టుజెప్పాల్సిందేననే ఆరోపణలు ఉన్నాయి. శాలరీ బిల్లులు చేయాలన్నా.. ఇంక్రిమెంట్ల ప్రతిపాదనలు పంపాలన్నా వారు అడిగినంత ఇవ్వాల్సిందేనని కొంతమంది ఉద్యోగులు వాపోతున్నారు. సెలవులు కావాలంటే కొందరిని ప్రసన్నం చేసుకోవాలిన పరిస్థితి ఉన్నట్లు సమాచారం.
కేసులను ఆసరాగా చేసుకొని..
ఎనిమిది నెలల క్రితం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం జిల్లాలో పర్యటించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీలపై కేసులు నమోదు చేసింది. 17 మందిపై చర్యలకు సిఫారసు చేస్తూ అందుకు సంబంధించిన నివేదికను జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు పంపారు. నేటి వరకు మిన్నకుండిన ఉన్నతాధికారులు నేడు కేసుల నుంచి తప్పిస్తామంటూ అక్రమాలకు తెరతీశారు. ఓ అధికారి ఆర్‌ఎంపీలతో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. కేసు పడిన ప్రతి ఒక్కరూ రూ.20 వేలు చలానా కట్టేలా ఒప్పించారు. ఇది సాఫీగా జరగాలంటే తనకు రూ.25 వేల చొప్పున ఇవ్వాలని డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు 15 మంది చలానా కట్టగా వారి నుంచి రూ.25 వేలు దండుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఆ శాఖ ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా..
జిల్లా వ్యాప్తంగా మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా పలువురు క్లీనిక్‌లు నిర్వహిస్తున్నారు. కేవలం ప్రథమ చికిత్స చేయాల్సిన ఆర్‌ఎంపీలు ఇంజక్షన్లు, సైలెన్ బాటిళ్లు పెట్టడం వంటి పూర్తిస్థాయి వైద్య సేవలందిస్తున్నారు. ఇలాంటి క్లినిక్‌లపై కేసులు నమోదైనా నిర్వాహకులు ఏ మాత్రం బెదరడం లేదు. కొద్ది రోజులకే యథావిధిగా వైద్యం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు విషయం తెలిసినా వారు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆ శాఖ ఉన్నతాధికారి అవకతకవకలు, అక్రమాలపై ఆకాశరామన్న ఉత్తరం పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై డీఎంహెచ్‌ఓ సుధాకర్‌లాల్‌ను వివరణ కోరగా.. ఇవేవి తన దృష్టికి రాలేదని.. తన ప్రమేయం ఉందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎనిమిది నెలల క్రితం 17మందిపై చర్యలు
ఫైన్ పేరిట రూ.20 వేలు
అదనంగా దండుకుంటున్నట్లు ఆరోపణలు


