● మళ్లీమళ్లీ అడిగితే బాగుండదు
● రైతుపై రుసరుసలాడిన
ఫెర్టిలైజర్ షాపు యజమాని
ధారూరు: డీఏపీ బుక్ చేసి, బస్తా కోసం షాపు వద్దకు వెళ్లిన రైతుపై యజమాని దబాయింపులకు దిగడం చర్చనీయాంశమైంది. మున్నూరుసోమారంలోని అనంత పద్మనాభ ఫెర్టిలైజర్ షాపులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. దోర్నాల్ గ్రామానికి చెందిన రైతు మెండె మహిపాల్ ఆన్‌లైన్‌లో ఒక బస్తా డీఏపీ బుక్ చేశాడు. షాపు వద్దకు వెళ్లి ఇవ్వాలని కోరగా, ‘నా దగ్గర స్టాక్ లేదని యజమాని సమాధానం చెప్పాడు. స్టాక్ ఉంటేనే యాప్‌లో ఉంటేనే బుక్ అవుతుంది కదా..? అని రైతు ప్రశ్నించగా.. యాప్‌లో బుక్ చేస్తే క్యాన్సిల్ చేసుకో.. మళ్లీమళ్లీ అడిగితే బాగుండదు అని హెచ్చరించాడు. ఇక చేసేదేమీ లేక సదరు రైతు విషయాన్ని వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్లాడు. యజమాని బెదిరింపుల వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది విన్న అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎవరికై నా ఫిర్యాదు చేసుకో, నన్నెవరూ ఏం చేయలేరు‘ అని యజమాని అన్నట్లు రైతు వాపోయాడు. గతంలోనూ ఇదే దుకాణంపై ఫిర్యాదులు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోలేదని, అందుకే ఇష్టానుసారంగా ఎరువులు విక్రయిస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. ఏఓ సూర్యప్రకాశ్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.


