న్యూస్‌రీల్
మహిళల పేరిట కార్డులు
బుధవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2026
వికారాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. వారం రోజుల్లోగా లబ్ధిదారులందరికీ పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల పలువురికి కొత్త కార్డులు కూడా మంజూరయ్యాయి. జిల్లాలో మొత్తం 2,88,500 రేషన్ కార్డులు ఉండగా వారందరికీ స్మార్టు కార్డులు అందనున్నాయి. పౌర సరఫరాల శాఖ కార్టులను ముద్రించిన రెవెన్యూ శాఖకు అందజేసింది. మండలాల వారీగా వేరు చేసి తహసీల్దార్లకు ఇచ్చారు. త్వరలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పరిగి నియోజకవర్గంలో ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా త్వరలో ఇవ్వనున్నారు.
దశాబ్దన్నర కాలం తర్వాత..
పదహారేళ్లుగా పేదల రేషన్ కార్డుల కోసం ఎదురు చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కార్డుల ఆశలు తీరలేదు. లబ్ధిదారులను ఎంపిక చేయటం.. వారికి రేషన్ పంపిణీ చేయడంతోనే సరిపెడుతూ వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక పలు దఫాలుగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ కార్డులు మాత్రం ఇవ్వలేదు. 2013లో కూపన్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత వాటిని కూడా ఆపేశారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేసినా తెల్లరేషన్ కార్డును తప్పని సరి చేసింది. దీంతో కార్డు అవసరమైన ప్రతి సారీ లబ్ధిదారులు ఆన్‌లైన్ డౌన్‌లోడ్ చేసుకుంటూ వచ్చారు. ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇటీవల రేషన్ కార్డులు ముద్రించింది. సాధారణ కార్డులు కాకుండా స్మార్టు కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కొందరికి కార్డులు ఇచ్చి ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఎంతో ఉపయోగం
అచ్చం ఏటీఎం కార్డు తరహాలో రేషన్ స్మార్ట్ కార్డు ఉంది. కుటుంబ యజమానురాలు ఫొటోను కార్డుపై ముద్రించి పంపిణీ చేస్తోంది. కార్డుపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల పేర్లు వచ్చేలా తయారు చేశారు. ఎంత మంది సభ్యులు ఉన్నారు. ఏయే నెలలో ఎంత రేషన్ తీసుకున్నారు. తదితర వివరాలన్నీ తెలుస్తాయి. భవిష్యత్తులో అన్ని సంక్షేమ పథకాలకు ఈ కార్డులనే ప్రామాణికం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 20 మండలాలు.. 588 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,88,500 కార్డులు.. 11,20,166 యూనిట్లు ఉన్నాయి. ప్రతి నెలా 6,380 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రతి క్వింటాలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా చార్జీలతో కలిపి కిలోకు రూ.57 వరకు ఖర్చు చేస్తోంది. అయితే కేవైసీ పూర్తి చేసిన వారికే మొదటి విడతలో స్మార్టు రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. మిగతా వారికి కే వైసీ ప్రక్రియన పూర్తి చేసుకున్న తర్వాతే ఇచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే ప్రక్రియనుప్రారంభించిన అధికారులు
వారం రోజుల్లోగా లబ్ధిదారులందరికీ..
జిల్లాలో మొత్తం కార్డులు 2,88,500
ప్రతి నెలా పంపిణీ చేస్తున్న బియ్యం 6,380 మెట్రిక్ టన్నులు


