కొడంగల్ రూరల్: పట్టణంలో వెలసిన రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ఈ నెల 29 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు మంగళవారం తెలిపారు. 29వ తేదీ ఉదయం 5:30గంటలకు సుప్రభాతం, 8:30గంటలకు ప్రత్యేక పూజలు, 9:30గంటలకు పంచామృతాభిషేకం, 10:30 గంటలకు అష్టోత్తర పారాయణం, 11గంటలకు తులసి అర్చన, ఒంటి గంటకు హస్తోదకం, మంగళహారతి, సాయంత్రం 6గంటలకు ప్రవచనాలు, 7గంటలకు భజన, పల్లకీ సేవ, అష్టావధానం, 30వ తేదీ ఉదయం 10గంటలకు రథోత్సవం, రాత్రి 8గంటలకు భజన, 31వ తేదీ రాత్రి 8గంటలకు భజనతో వేడుకలు ముగియనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.
కొడంగల్: పట్టణంలోని పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బాలాలయంలో ఈ నెల 29న లక్ష తులసీ అర్చన నిర్వహించనున్నారు. పూలు, తులసీ దళాలతో స్వామి, అమ్మవార్లకు విశేష అలంకరణ చేస్తారు. బ్రాహ్మణులు విష్ణు సహస్ర నామావళి పటిస్తూ అర్చన నిర్వహిస్తారు. శ్రావణమాసం మూడో శనివారం కావడంతో శ్రీవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. విష్ణు సహస్ర నామార్చన, నైవేద్యం, మహా మంగళహరతి తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు.
బొంరాస్‌పేట: ప్రపంచ జానపద దినోత్సవ ముగింపు వేడుకలు ఈ నెల 31న నగరంలోని జరగనున్నట్లు జానపద కళాకారుల సంఘం జిల్లా నాయకులు కృష్ణయ్య, వెంకటేష్, వెంకటయ్య లలిత, శోభారాణి, తులసి తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. ఈ వేడుకలకు మంత్రి జూపల్లి, సినీ నటుడు మురళీమోహన్, సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కేవీ రమణాచారి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ శ్రీనివాస్‌గౌడ్, సుంచు లింగయ్య తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. వేడకల్లో జిల్లా తరఫున తోలుబొమ్మలాట, అంబేడ్కర్ వీధినాటకం, మహిళల కోలాట ప్రదర్శనలకు అవకాశం ఉన్నట్లు తలిపారు.
మర్పల్లి: ఆర్గానిక్, ఆధునిక పద్ధతిలో పసుపు సాగు చేస్తున్న మండలంలోని సిరిపురం రైతులకు అరుదైన గౌరవం దక్కింది. మంగళవారం నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. గ్రామానికి చెందిన రైతులు మర్రి కృష్ణారెడ్డి, మధుసుదన్ రెడ్డి, గోపాల్ అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు.
జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం
బంట్వారం: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న వికారాబాద్ కలెక్టరేట్ వద్ద తలపెట్టిన మహాధర్నాకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంకటరత్నం పిలుపునిచ్చారు. మంగళవారం కోట్‌పల్లి మండలంలో పలు పాఠశాలల్లో సంఘం సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్‌సీ అమలు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు కావస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికై నా స్పందించాలని లేకుంటే వచ్చే నెల 10న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.


