తాండూరు టౌన్: పాత తాండూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్‌రూం లేదా ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందిస్తామని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్వోబీ పూర్తయితే పాత తాండూరు వాసులకు రైల్వే గేట్ వల్ల ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయన్నారు. అలాగే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైనేజీ నిర్మాణం, విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తామన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలని, త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. అందుకు విరివిరిగా మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. మంగళవారం స్థానిక మెడికల్ కళాశాల ఆవరణలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, పలువురు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అర్హుల ఓట్లు పోకుండా చూడాలి
అర్హుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోకుండా చూడాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పార్టీ బీఎల్‌ఏలకు సూచించారు. మంగళవారం పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ హాల్‌లో నియోజకవర్గ బీఎల్‌ఏలకు సర్ ఫేస్–2లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 50వేల మంది ఓటర్లకు నోటీసులు జారీ అయినట్లు చెప్పారు. వీరందరూ తప్పకుండా వివరణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బీఎల్‌ఏలపై ఉందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ, నియోజకవర్గ సర్ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, పార్లమెంట్ ఇంచార్జి జగదీశ్వర్ రావు, కొడంగల్ సర్ కో ఆర్డినేటర్ మల్లేశ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
ఉద్యోగ సాధనలో యువతకు అండగా ఉంటానని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బీఎమ్మార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకు పోటీ పరీక్షల నిమిత్తం ఉచిత శిక్షణ ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి


