కొడంగల్: కొన్ని నెలలుగా కొడంగల్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇటీవల జరిగిన రాయితీ విత్తనాల కుంభకోణం మరువక ముందే నకిలీ డీఏపీ విషయం తెరపైకి వచ్చింది. అంతేకాకుండా బ్రాండెడ్ కంపెనీలకు చెందిన డీఏపీ బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. ఇందుకు నిదర్శనం మూడు రోజుల క్రితం కొడంగల్‌లోని ఓ ఎరువుల దుకాణం వ్యాపారి అధిక ధరలకు డీఏపీ విక్రయిస్తూ కెమెరాకు దొరికిపోయాడు. ఈ విషయంపై విచారణకు వచ్చిన వ్యవసాయాధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి వెళ్లిపోయారు. అయితే సదరు వ్యాపారి మంగళవారం ఉదయం అధిక ధరలకు డీఏపీ కొనుగోలు చేసిన రైతు వద్దకు వెళ్లి సానుకూలంగా పత్రం రాయించుకోవడం కొసమెరుపు.
రైతులను ముంచుతున్న వ్యాపారులు
నెల రోజులుగా నకిలీ డీఏపీ బాగోతం రైతులను పట్టి పీడిస్తోంది. జిల్లాలో తరచూ ఏదో ఒక చోట కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పరిగి, చన్గోముల్, బంట్వారం, యాలాల్ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నకిలీ డీఏపీ సరఫరా చేసిన వారిపైనా, విక్రయించిన వారిపైనా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు ధ్రువీకరించలేదు. దీంతో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ డీఏపీ వ్యవహరం రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినా వంటకు మేలు చేస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. వారు కొనుగోలు చేసిన డీఏపీని పొలాల్లో పైరుకు వేశారు. మొలకలు పెరిగితే కానీ తెలియదు. అది మంచిదా.. నకిలీదా అని.. అక్రమ దందాపై నిగ్గు తేల్చాల్చిన వ్యవసాయ శాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ దందా కొడంగల్‌లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా నడుస్తున్నట్లు సమాచారం. టన్నుల కొద్దీ నకిలీ డీఏపీని రైతులకు అంటగట్టి లక్షలు దోసుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
అధిక ధరలకు..
బ్రాండెడ్ ఎరువు బస్తాలను ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. బస్తా ధర రూ.1,350 ఉండగా రూ.1,600కు విక్రయిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రసీదు ఇవ్వమని వ్యాపారిని అడిగితే బుక్క చిట్టీపై రాసి ఇస్తున్నారని తెలిపారు. రైతుల పక్షాన ఉండి న్యాయం చేయాల్సిన వ్యవసాయాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అభం శుభం తెలియని రైతులు తమకు దొరికిందే తడవుగా డీఏపీ బస్తాలను ఇంటికి తీసుకెళ్లి పొలాలకు వేశారు. ఇప్పుడు నకిలీ వ్యవహరం బయట పడడంతో తాము వేసింది అసలో.. నకిలోనని ఆందోళన చెందుతున్నారు. దుకాణాదారులు ఇచ్చిన డీఏపీ బస్తాలను తాము తీసుకెళ్లామని వాటిల్లో ఏముందో పసిగట్టే తెలివి తమకు లేదని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో వరుసగా నమోదవుతున్న నకిలీ డీఏపీ కేసులు
ఇప్పటికే పంటలకు ఎరువు వేసిన వేలాది మంది రైతులు
అసలో.. నకిలీదో తెలియక అయోమయం
నిలువునా ముంచుతున్న అక్రమార్కులు


