అక్రమ నిర్మాణాలకు అధికారిక గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలకు అధికారిక గుర్తింపు

Aug 27 2026 7:20 AM | Updated on Aug 27 2026 7:20 AM

దరఖాస్తు చేసుకుంటే నంబర్‌

మొయినాబాద్‌: మున్సిపాలిటీలో ఇంటి నంబర్ల దందా కొనసాగుతోంది. 111 జీఓ పరిధిలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లేనప్పటికీ వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నిర్మాణం జరుగుతున్న క్రమంలోనే మున్సిపల్‌ అధికారులు ఇంటి నంబర్లు కేటాయిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు రూ.లక్షల్లో దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఏడాదిన్నర కాలంలో ఏకంగా వెయ్యికి పైగా అక్రమ నిర్మాణాలకు ఇంటి నంబర్లు కేటాయించారు.

ప్రాపర్టీ ట్యాక్స్‌ చెల్లించినట్లు రికార్డు

హిమాయత్‌నగర్‌ రెవెన్యూలోని పద్మావతి కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి మూడు నెలల క్రితమే ఇంటి నంబర్‌ కేటాయించారు. జీ ప్లస్‌ 6, పెంట్‌హౌస్‌ నిర్మిస్తున్న ఆ భవనం నిర్మాణ పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. జీ ప్లస్‌ 5 అంతస్తుల వరకు గోడల నిర్మాణం పూర్తయింది. ఈ భవనానికి 6–77/36 ఇంటి నంబర్‌ను కేటాయిస్తూ 2026 మే 20న మున్సిపల్‌ కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌ అప్రూవ్‌ చేశారు. ఇందులో భవనం విస్తీర్ణం ఎంత ఉందనేది పేర్కొనకపోగా.. సంవత్సరానికి రూ.67,820 ప్రాపర్టీ ట్యాక్స్‌ అవుతుందని.. అందులో ఆరు నెలల ప్రాపర్టీ ట్యాక్స్‌ రూ.33,910 చెల్లించినట్లు అసెస్మెంట్‌ రిజిస్టర్‌ కాపీలో పేర్కొనడం గమనార్హం.

జంట జలాశయాలకు ముప్పు!

మున్సిపాలిటీలో ఇంటి నంబర్ల కేటాయింపు తంతు నిత్యకృత్యంగా మారింది. పూర్తిగా 111 జీఓ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలో నిబంధనల ప్రకారం ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు. నిర్మాణాలు జరుగుతున్న సమయంలో అధికారులు నామమాత్రంగా నోటీసులు ఇచ్చి మమ అనిపిస్తున్నారు. నిర్మాణాలు చివరి దశకు రాగానే వాటికి ఇంటి నంబర్లు కేటాయిస్తూ అక్రమ నిర్మాణాలను యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు రూ.లక్షల్లో దండుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీ ఏర్పడి ఏడాదిన్నర కాలం దాటింది. ఈ కాలంలోనే ఏకంగా వెయ్యికి పైగా ఇంటి నంబర్లు కేటాయించారు. అంటే మున్సిపల్‌ అధికారుల అక్రమార్జన ఎంత అనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆరు నెలలగా అధికారులకు పోటీగా ప్రజాప్రతినిధులు తయారయ్యారు. ఎక్కడ నిర్మాణాలు జరిగినా వారి నుంచి లక్షల్లో దండుకుని ఇంటి నంబర్లు ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీలో అక్రమాల జోరు ఇదే స్పీడులో కొనసాగితే వచ్చే ఐదేళ్లలో ఇళ్ల నుంచి వచ్చే మురుగు, కలుషిత జలాలతో జంటజలాశయాలు మరో హుస్సేన్‌ సాగర్‌గా మారిపోతాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం నిర్మాణ అనుమతులు, సంబంధిత పత్రాలను పరిశీలించాల్సిన అధికారులు అవేమీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

పర్మిషన్‌ లేని నిర్మాణాలకు ఇంటి నంబర్లు

ఏడాదిన్నరలో వెయ్యికి పైగా కేటాయింపు

మున్సిపల్‌ అధికారుల చేతివాటంపై ఆరోపణలు

మున్సిపాలిటీ పరిధిలో ఇళ్లు నిర్మించుకునేవారు దరఖాస్తు చేసుకుంటే ఇంటి నంబర్‌ కేటాయిస్తాం. నంబర్‌ కేటాయించడానికి ఇంటి నిర్మాణం జరుగుతుందని తెలిస్తే చాలు.. నిర్మాణం ఏ దశలో ఉంది అనేది ప్రామాణికం కాదు. ఏడాదిన్నరలో మున్సిపాలిటీలో సుమారు వెయ్యికి పైగా కొత్త ఇంటి నెంబర్లు కేటాయించాం.

– జాకీర్‌ హుస్సేన్‌, కమిషనర్‌, మొయినాబాద్‌ మున్సిపాలిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement