అనుమతుల రద్దుకు డిమాండ్
తీజ్ సంబురం
ప్రభుత్వ భూములే లక్ష్యంగా కబ్జాలు, కట్టడాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఖాళీ భూమి కనిపిస్తే చాలు.. కబ్జా చేస్తున్నారు. చివరకు రాచకాల్వలు, శ్మశానాలను కూడా వదలడం లేదు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం అటువైపు వెళ్లేందుకే వెనకాడుతోంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై తప్పుడు నివేదికలు అందిస్తూ.. కొంతమంది ఏకంగా కలెక్టర్‌నే తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫలితంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునగనూరు, ఇంజాపూర్, మన్నెగూడ రెవెన్యూల పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు.. వారి అనుచరులు కలిసి వీటిని కొల్లగొడుతున్నారు. సాధారణంగా పేదలు ఎవరైనా అరవై గజాల స్థలాన్ని ఆక్రమించి, ఓ చిన్న గుడిసె వేసుకున్నా వెంటనే వాలిపోయే రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ అధికారులు కళ్ల ఎదుటే భూములను మింగేస్తున్నా పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కలెక్టర్‌కే తప్పుడు నివేదికలు!
మునగనూరు రెవెన్యూ సర్వే నంబర్ 44లోని 40.10 ఎకరాల భూమి 1954– 55 కాస్రా పహాణీ ప్రకారం పోరంబోకు సర్కారీ భూములుగా నమోదయ్యాయి. ఇందులో 15 ఎకరాల భూమి ఇప్పటికే అన్యాక్రాంతమైంది. తాజాగా మరో 12 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల పేరున మారడంపై ‘పత్రాలు సృష్టించి.. పట్టా చేసేశారు’ శీర్షికతో ‘సాక్షి’ ప్రధాన ఎడిషన్‌లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పదించిన ఆర్డీఓ, తహసీల్దార్ సహా ఇతర అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి, భూములను పరిశీలించారు. మొత్తం భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నట్లు స్థానిక తహహసీల్దార్ జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. అయితే అప్పటికే స్థానికుడైన ఓ మైనింగ్ కాంట్రాక్టర్ ఏకంగా రెండెకరాలకుపైగా భూమిని కబ్జా పెట్టారు. అందులో మట్టి, కంకర, ఇసుక సహా పెద్ద సంఖ్యలో లారీలను పార్కింగ్ చేస్తున్నారు. కబ్జాదారు చెరలో బందీగా మారిన సదరు భూమిని అధికారులు ఇప్పటికీ స్వాధీనం చేసుకోలేదు. ఆయా భూములు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్లు అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ నివేదిక సమర్పించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు.
రిజిస్ట్రేషన్ ఒకచోట.. కబ్జా మరోచోట
● ప్రభుత్వ భూములను ఆనుకుని.. పట్టా భూములు ఉండటం అక్రమార్కులకు ఇది కలిసి వచ్చింది.
● మునగనూరు రెవెన్యూ సర్వే నంబర్ 42 సహా పెద్ద అంబర్‌పేట శివారులోని సర్వే నంబర్ 82లోనూ పట్టా భూములు ఉన్నాయి.
● వీటికి ఆనుకునే సర్వే నంబర్ 44లోని ప్రభుత్వ భూమి ఉంది. ఎలాగైనా వీటిని కొల్ల గొట్టాలని భావించిన కొంతమంది అక్రమార్కులు.. సర్వే నంబర్, 42, 82లతో డాక్యుమెంట్ సృష్టించి.. ఆ పక్కనే ఉన్న సర్వే నంబర్ 44లోని ప్రభుత్వ భూమిలో పొజిషన్ తీసుకుంటున్నారు.
● ఓ రిటైర్డ్ కారోబార్ సాయంతో పాత తేదీలతో ఇంటి నంబర్లు సేకరించి, ఆయా ఖాళీ ప్రభుత్వ భూముల్లో కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు.
● ఇంజాపూర్ రెవెన్యూ సర్వే నంబర్ 66లోని 1.27 ఎకరాల ప్రభుత్వ భూమి సైతం మునగనూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 44లోని ప్రభుత్వ భూమికి ఆనుకుని ఉంటుంది. అక్రమార్కులు మునగనూరు సర్వే నంబర్ 42లోని పట్టా భూమి పేరుతో డాక్యుమెంట్ సృష్టించి.. ఆ పక్కనే ఉన్న ఇంజాపూర్‌లోని సర్వే నంబర్ 66లోని ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడుతున్నారు.
● మునగనూర్ సర్వే నంబర్ 38లోని ఇందిరమ్మ కాలనీలో 2వేల గజాలకుపైగా ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది. సర్వే నంబర్ 47లోని రాచకాలువతో పాటు జయసూర్యనగర్ కాలనీలో కాల్వలు, వాటికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాలు కబ్జాకు గురయ్యాయి.
● మన్నెగూడ రెవెన్యూ సర్వే నంబర్– 1లోని ఎకరానికిపైగా ప్రభుత్వ భూమిలో ఇప్పటికే అక్రమ షెడ్లు వెలిశాయి. వీటిని తొలగించి, స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇది పరోక్షంగా అక్రమార్కులకు సహకరించడమేనని విమర్శలున్నాయి.
మునగనూర్, ఇంజాపూర్, మన్నెగూడలో జోరుగా ఆక్రమణలు
ప్రైవేటు సర్వేనంబర్లతో నకిలీ డాక్యుమెంట్లు.. ప్రభుత్వ భూమిలో పొజిషన్లు
కళ్లుమూసుకుని అనుమతులు
జారీ చేస్తున్న మున్సిపల్ అధికారులు
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదుల వెల్లువ
కూల్చివేతలకు సిద్ధమవుతున్న రెవెన్యూ, పోలీసు యంత్రాంగం
ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై సాక్షిలో వస్తున్న వరుస కథనాలకు తోడు.. స్థానికుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఒత్తిడి నేపథ్యంలో అబ్దుల్లాపూర్‌మెట్ మండల రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. మునగనూరు రెవెన్యూ సర్వే నంబర్ 44లోని ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలు, ఇతర ఆక్రమణల తొలగింపుకు రంగం సిద్ధం చేసింది. కూల్చివేతలకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి హయత్‌నగర్ పోలీసులకు లేఖ రాశారు. ఇదిలా ఉండగా ఐదు అక్రమ నిర్మాణాలకు సంబంధించి జారీ చేసిన అనుమతులు, ప్రొసిడింగ్స్‌ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఆదిభట్ల మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సహా హెచ్‌ఎండీఏ కమిషనర్లకు తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా గుడ్డిగా నిర్మాణ అనుమతులు జారీ చేసిన టీపీఓలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.


