● లయన్స్ క్లబ్ ఫౌండర్,
మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి
● నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం
కొడంగల్: పేదలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావించాలని కొడంగల్ లయన్స్ క్లబ్ ఫౌండర్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని రాఘవేంద్ర గార్డెన్స్‌లో లయన్స్ క్లబ్ 37వ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న గురునాథ్‌రెడ్డి, నటరాజ్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. కొడంగల్‌లో కంటి ఆసుపత్రి నిర్మించడానికి కృషి చేయాలన్నారు. స్థలం కేటాయిస్తే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి నిధులు మంజూరు చేయిస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకునే అవకాశం ఉందన్నారు. కొడంగల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిత కంటి వైద్య శిబిరాలు, ఉత్తమ సేవకులకు నన్మానాలు, మొక్కలు నాటడం, వినికిడి యంత్రాల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ.. 2026– 27లో తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు. ఇన్‌స్టాలేషన్ అధికారిగా డాక్టర్ శశికాంత్, ఇండక్షన్ ఆఫీసర్‌గా మృత్యుంజయ, చైర్మన్‌గా ముద్దప్ప దేశ్‌ముఖ్ వ్యవహరించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు దాసప్ప యాదవ్, భీమన్న గౌడ్, రాంరెడ్డి, వెంకట్‌రెడ్డి దేశ్‌ముఖ్, శ్రీకిషన్‌రావు, శివకుమార్ గుప్త, మిఠాయిరాజు, భీమరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని ఐనన్‌పల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. పట్టణ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ రవీంద్రయాదవ్, కార్యదర్శిగా డాక్టర్ సాకేత్, కోశాధికారిగా ముర హరి వశిష్టను లయన్స్‌క్లబ్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా గురువారం రాత్రి వీరు ప్రమాణ స్వీకారం చేశారు. కొడంగల్ లయన్స్ క్లబ్‌లో కొత్తగా ఏడుగురు సభ్యులు చేరారు.


