నవాబుపేట: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని జెడ్పీ సీఈఓ సుధీర్ సూచించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్షాసమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ఆయా శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, విద్య, వైద్య ఆరోగ్యం, విద్యుత్, హౌసింగ్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, పశుసంవర్ధక, ఆర్‌అండ్‌బీ, ఉద్యాన, ఎకై ్సజ్, ఇరిగేషన్, ఫారెస్ట్, వెటర్నరీ తదితర శాఖల అధికారులతో మాట్లాడి ఆయా విభాగాల పురోగతిని ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్‌లు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సీఈఓ ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధకారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు స్పందించాలన్నారు. వీబీజీరాజ్‌జీ పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్‌అండ్‌బీ ఏఈ సుస్మిత సభలో నివేదికను వివరిస్తుండగా.. ఆర్‌అండ్‌బీ రోడ్లు మంజూరై ఏళ్లు గడుస్తున్నా ఎందుకు నిర్మించడం లేదని సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కొండల్ యాదవ్ ప్రశ్నించారు. రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే కాలె యాదయ్య చెబుతున్నా ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదన్నారు. ఈవిషయంపై దాతాపూర్ సర్పంచ్ బల్వంత్‌రెడ్డి స్పందిస్తూ ఎమ్మెల్యే గ్రామాలను అభివృద్ధి చేశారని, రోడ్ల నిర్మాణం కూడా జరుగుతోందని చెప్పడంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. పోలీసులు, అధికారులు కలగజేసుకొని ఇద్దరికీ నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మండల ప్రత్యేక అధికారి కవిత అధ్యక్షతన, ఎంపీడీఓ అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఎంఈఓ అబ్దుల్ రహమాన్, ఎంహెచ్‌ఓ రోహిత్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్‌రెడ్డి, ఎంపీఓ విజయ్‌కుమార్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసమస్యలను పరిష్కరించండి
జెడ్పీ సీఈఓ సుధీర్
ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష


