చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన కారు | - | Sakshi
Sakshi News home page

చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన కారు

Aug 1 2026 7:52 AM | Updated on Aug 1 2026 7:52 AM

చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన కారు నకిలీ డీఏపీ తయారీ ముఠా అరెస్ట్‌ ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ ట్రాఫిక్‌ రూల్స్‌ తప్పనిసరి

కుల్కచర్ల: అదుపు తప్పిన కారు చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. చెల్లాపూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుల్కచర్లకు కారులో వస్తుండగా ముందు టైరు పేలడంతో రోడ్డు కిందకు వేగంగా దూసుకెళ్లింద. వాహనంలోని ఇద్దరు పిల్లలకు స్వల్పగాయాలయ్యాయి.

రూ.2 కోట్ల విలువైన సామగ్రి స్వాధీనం

హుజూర్‌నగర్‌: మార్కెట్‌లో డీఏపీ కొరతను ఆసరాగా చేసుకుని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ డీఏపీ తయారు చేసి విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి నకిలీ డీఏపీ దందాకు తెరలేపారు. హైదరాబాద్‌ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో గోడౌన్‌ ఏర్పాటు చేసి నకిలీ డీఏపీని తయారు చేసి అక్కడి నుంచి పలు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. రైతులకు నకిలీ ఎరువు బస్తాలు వస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈనెల 15న మఠంపల్లి ఏఓ బొలిశెట్టి శ్రీనివాస్‌ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు రఘునాథపాలెంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ కొండేటి పిచ్చిరెడ్డి అనే వ్యాపారి దగ్గర నకిలీ డీఏపీ బస్తాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మఠంపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.

ఆరుగురు నిందితుల అరెస్ట్‌.. పరారీలో ఇద్దరు

పిచ్చిరెడ్డి ఇచ్చిన సమాచారంతో అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జగదీష్‌ అలియాస్‌ జక్కప్ప, ఆనంద్‌ రావుకు సంబంధించిన తయారీ కంపెనీలో పోలీసులు తనిఖీ చేశారు. అక్కడ 1000 డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షించగా.. నకిలీదని తేలింది. దీంతో రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డి, వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ గ్రామానికి చెందిన పొలే వెంకటేశ్వర్లు, ఏపీలోని కర్నూలు పట్టణానికి చెందిన పింజారి మౌలాలి, జోగులాంబ గద్వాల జిల్లాలోని లింగనవాయి గ్రామానికి చెందిన అబ్దుల్‌ రెహమాన్‌, కర్నాటక రాష్ట్రంలోని విజయపురి జిల్లా దేవరౌప్పరి తాలూకా మానూర్‌ గ్రామానికి చెందిన హీర్లకొండ సంతోష్‌ కుమార్‌, మఠంపల్లి మండలం బక్కమంతుగూడేనికి చెందిన పింగళి గంగామహేశ్వరరెడ్డిని అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి డీసీఎం, ఓ కారు, ఐదు సెల్‌ఫోన్లు, వివిధ కంపెనీల లేబుల్‌ కలిగిన నకిలీ డీఏపీ బస్తాలు, నకిలీ ఎరువు మందులు తయారు చేయడానికి వాడిన మిషన్‌, నకిలీ పాస్పేట్‌, దాదాపు రూ.2 కోట్ల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్‌, జగదీశ్‌ అనే ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐలు ప్రవీణ్‌, నవీన్‌, ఏఎస్‌ఐ బలరాం రెడ్డి, సిబ్బంది శంభయ్య, నాగరాజును అభినందించారు.

షాబాద్‌: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన నాగరగూడ ఎక్స్‌ రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నాగరగూడ ఎక్స్‌ రోడ్డు వద్ద షాద్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును శంషాబాద్‌ వైపు నుంచి వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్రంగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారికి నాగరగూడ శ్రీనివాస ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన నామ మమత, శంషాబాద్‌ మండలం సుల్తాన్‌పల్లికి చెందిన శిరీష, మరో ఇద్దరు ఉన్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాలె శ్రీకాంత్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట చేవెళ్లకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు మధుసూదన్‌గుప్తా ఉన్నారు.

షాద్‌నగర్‌: వాహనదారులు విధిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని నందిగామ సీఐ వీరబాబు అన్నారు. శుక్రవారం నందిగామ మండల కేంద్రంలో పోలీసులు ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. 80 వాహనాలు తనిఖీ చేసి 53 వాహనాలకు పెండింగ్‌లో ఉన్న చలాన్లను క్లియర్‌ చేయించారు. ఎనిమిది మంది వాహనదారులకు స్పాట్‌ చలాన్లు విధించారు. డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనం నడిపిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఐ వీరబాబు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement