విషయం బయటకొచ్చిందిలా..!
బషీరాబాద్: గుప్తనిధి ఆశ చూపించాడు.. ఇంటి ఆవరణలో కోట్ల విలువైన నిధి దాగి ఉందంటూ నమ్మించాడు. ప్రత్యేక పూజలు, తంత్రాలు చేస్తే అది బయటపడుతుందని చెప్పాడు. ఇందుకోసం విడతలవారీగా రూ.8 లక్షలు వసూలు చేసి, మాయమయ్యాడు.
నమ్మకంగా వల..
కర్ణాటకకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ద్వారా జీవన్గీకి చెందిన ఇద్దరు వ్యక్తులకు గతేడాది ఆగస్టులో హైదరాబాద్ దూల్‌పేట వాసి లక్ష్మణ్‌సింగ్ హజారీ పరిచయమయ్యాడు. అతీంద్రియ శక్తులు కలిగిన బాబాగా తనకు తాను చెప్పుకొన్నాడు. ఒకరోజు జీవన్గీకి వచ్చి ఓ ఇంటిని పరిశీలించిన సదరు బాబా.. ఇంట్లో కోట్ల విలువైన బంగారు నిధి ఉందని, ప్రత్యేక పూజలు, మంత్రాలతో వెలికి తీస్తానని నమ్మించాడు. ఆతర్వాత నిధికి నాగబంధం ఉందని, దాన్ని తొలగించేందుకు ప్రత్యేక హోమాలు, అరుదైన పూజా సామగ్రి అవసరమని చెప్పాడు. ఇందుకోసం దశలవారీగా ఇద్దరి నుంచి సుమారు రూ.8 లక్షలు వసూలు చేశాడు.
మట్టి కుండతో మాయాజాలం
ఓ రోజు నిధిని బయటకు తీస్తానని చెప్పిన బాబా.. ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి, ఎవరినీ రావొద్దన్నాడు. అర్ధరాత్రి సమయంలో పూజలు నిర్వహించి, తవ్వకాలు చేపట్టి ముందుగానే పాతిపెట్టినట్లు అనుమానిస్తున్న ఓ మట్టి కుండను వెలికి తీశాడు. అందులో నుంచి ఓ బంగారు రంగున్న బిల్లను చూపించి నిధి బయటపడిందని చెప్పాడు. దీంతో తవ్వకాలు చేయించినవారు ఎంతో సంతోషించారు. అయితే నాగబంధం పూర్తిగా తొలగిపోలేదని, వారం రోజుల్లో తిరిగి వచ్చి, ప్రత్యేక పూజల అనంతరం పూర్తి నిధిని అప్పగిస్తానని, అప్పటి వరకు కుండను ఎవరు తాకినా ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించి వెళ్లిపోయాడు. ఆరోజు నుంచి నకిలీ బాబా తిరిగిరాలేదు. ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. కొద్ది రోజుల తర్వాత కుండను తెరిచి చూడగా అందులో 78 బంగారు రంగు బిళ్లలను గుర్తించారు. వీటిని కర్ణాటకలోని ఓ బంగారం వ్యాపారి వద్దకు తీసుకెళ్లి పరీక్షించగా నకిలీవని తేలడంతో మోసపోయామని గుర్తించి లోలోపలే మదనపడ్డారు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. ఎలాగైనా తమను మోసగించిన బాబాను పట్టుకోవాలని పలుమార్లు దూల్‌పేట్‌లోని అతని ఇంటికి వెళ్లినా ఆచూకీ లభించలేదు. అతడి భార్య దివ్యభాయి కూడా ఇలాంటి మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లిందని చుట్టుపక్కల వారు చెప్పడంతో బాధితులు నిరాశగా తిరిగి వచ్చినట్లు సమాచారం.
గుప్తనిధులు తవ్వించిన ఇద్దరు వ్యక్తులు.. బాబాకు సమర్పించిన రూ.8 లక్షల్లో.. మరికొంత మంది వద్ద తీసుకున్న డబ్బులు కూడా ఉన్నాయి. నిధి దొరికిన తర్వాత పెద్దమొత్తంలో తిరిగిస్తామని చెప్పడంతో వారు కూడా సరేనన్నారు. కానీ, ఏడాది కావస్తున్నా ఇచ్చిన డబ్బులైనా చేతికి అందకపోవడంతో సదరు వ్యక్తుల ఇళ్లకు వెళ్లి గొడవ పెట్టుకున్నారు. బాబా ఎవరో తమకు తెలియదని, మిమ్మల్ని నమ్మి ఇచ్చాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఈవిషయం ఈనోటా ఆనోటా బయటకు పొక్కింది.
ఇద్దరి నుంచి రూ.8 లక్షలు వసూలు చేసిన నకిలీబాబా
జీవన్గీలో నాటకీయంగా వెలుగుచూసిన ఘటన


