● బీజేవైఎం జిల్లా నేత సాయిచరణ్‌రెడ్డి
● ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు డిమాండ్
తాండూరు టౌన్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతున్నామని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చిట్యాల సాయిచరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు గురువారం పట్టణంలోని శాలివాహన డిగ్రీ కళాశాల, భాష్యం జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో సమావేశమయ్యారు. అనంతరం ‘ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి’ పోస్టర్ విడుదల చేసి మాట్లాడారు. మూడేళ్లుగా రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో ఎంతో మంది ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.15 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యా సంవత్సరంలో నిర్ణీత గడువులోగా చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. లేదంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, కౌన్సిలర్ కిరణ్ ముదిరాజ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు తాండ్ర నరేష్, నాయకులు శోభన్, శ్రీనివాస్, హర్షవర్ధన్‌రెడ్డి, మంజునాథ్‌రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


