తాండూరు టౌన్: అభివృద్ధి పేరిట ముఖ్యమంత్రి సొంత జిల్లాలో దళిత, పేద రైతుల భూములు కబ్జాకు పాల్పడుతున్నారని.. ఇట్టి భూమికి భూమి ఇవ్వాల్సిందేనని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు బాధిత రైతులతో కలిసి తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాలాల మండలం దౌలాపూర్ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 73లో చెన్నారం, దౌలాపూర్‌కు చెందిన 11 మంది దళిత, వడ్డెర కులస్తులకు 25 ఎకరాల భూమిని 1980లో అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరిట రైతులకు సమాచారం లేకుండా సాగు భూమల నుంచి ఎర్రమట్టి తరలిస్తున్నారన్నారు. ఎలాంటి నష్టపరిహారం ఇప్పించకుండా రెవెన్యూ అధికారులు కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. దళితుల భూములను సాగుకు పనికిరాకుండా చేయడం దారుణమని, భూమికి భూమి లేదా వెంటనే నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, పలు సంఘాల నాయకులు చంద్రయ్య, గుమ్మడి రత్నం, చంద్రమ్మ, అంజిలమ్మ, వెంకటయ్య, మన్యప్ప, బాలరాజ్, సత్యమ్మ, అమృతమ్మ తదితరులు ఉన్నారు.
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య


