కడ్తాల్/షాద్‌నగర్ రూరల్: భార్యను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ షాద్‌నగర్ 16వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి స్వాతిరెడ్డి బుధవారం తీర్పునిచ్చినట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. వివరాలు.. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెంది వల్లపుడాస్ స్వరూప, శ్రీనివాస్ భార్యాభర్తలు. వీరు మండల పరిధిలోని కర్కల్‌పహాడ్ శివారులోని ఓ ఫాంహౌస్‌లో కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. మద్యానికి బానిసైన శ్రీనివాస్ స్వరూపను తరుచూ వేధించేవాడు. 2023 జూన్ 11న రాత్రి దంపతులు గొడవపడ్డారు. ఈ క్రమంలో భార్య స్వరూపను హత్య చేసి పరారయ్యాడు. 2023 జూన్ 12న సమాచారం అందుకున్న అప్పటి సీఐ ఉపేందర్, ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. నేరం రుజువు కావడంతో షాద్‌నగర్ 16 వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి స్వాతిరెడ్డి నిందితుడు శ్రీనివాస్‌కు జీవిత ఖైదుతో పాటు, రూ.5 వేలు జరిమానా విధి స్తూ తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు.
ఉన్నతాధికారుల అభినందనలు
హత్య కేసు దర్యాప్తులో సమర్థవంతంగా పనిచేయడంతో పాటు, సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచిన సీఐలు ఉపేందర్, వెంకటేశ్వర్లు, సైదిరెడ్డి, ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్, కానిస్టేబుల్స్ సుమిత్ర, దివ్యవాణిలను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.


