జొన్నల డబ్బుల్లో కోత
ధారూరు: కొనుగోలు కేంద్రంలో విక్రయించిన జొన్నలకు సంబంధించిన డబ్బుల్లో కోత పెట్టి వేధిస్తున్నారని మండలంలోని చింతకుంట గ్రామ రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం ధారూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో రైతులు ఎం.వెంకటయ్య, పి.విజయలక్ష్మి, పట్లోళ్ల ప్రభాకర్‌రెడ్డి, వడ్డె పరమానందం, శేఖర్‌రెడ్డి, పి.సింధు జొన్నలు విక్రయించగా నిర్వాహకులు తక్ పట్టీలు ఇచ్చారు. బుధవారం వారి ఖాతాల్లో డబ్బు జమ అయినట్లు ఫోన్లకు సమాచారం వచ్చింది. విక్రయించిన బస్తాల కంటే తక్కువ వాటికి డబ్బు జమ చేసినట్లు గుర్తించారు. పరమానందంకు 1.50 క్వింటాళ్లు, ప్రభాకర్‌రెడ్డి, విజయలక్ష్మి, వెంకటయ్యలకు క్వింటాలు చొప్పున, శేఖర్‌రెడ్డి సింధుకు 50 కిలోల సంబంధించిన డబ్బులు తక్కువగా జమ చేసినట్లు బాధితులు తెలిపారు. మా సమక్షంలో తూకం వేసి తక్ పట్టీలు ఇచ్చినా డబ్బు తక్కువ వేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ విషయమై ధారూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో అధికారులను ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వటం లేదన్నారు. ఈ విషయమై పీఏసీఎస్ సీఈఓ నర్సింహులును వివరణ కోరగా రైతుల విషయం తమ దృష్టికి వచ్చిందని, మార్క్‌ఫెడ్ అధికారులతో మాట్లాడి ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని న్యాయం జరిగేలా చూస్తామన్నారు.


