● రైతులు జాగ్రత్తగా ఉండాలి
● ఎస్పీ స్నేహ మెహ్ర
మోమిన్‌పేట: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. బుధవారం మోమిన్‌పేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పొలాలకు వెళ్లే రైతులు మార్గమధ్యలోని వాగులను దాటే క్రమంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే దాటే సాహసం చేయరాదని సూచించారు. గత ఏడాది మండలంలోని మేకవనంపల్లి వద్ద వాగు దాటుతూ ఓ యువకుడు గల్లంతై మృతి చెందిన ఘటనను ఆమె గుర్తు చేశారు. మద్యం సేవించి, హెల్మెట్, సీటు బెల్టు లేకుండ వాహనాలు నడిపితే చర్యలు ఉంటాయన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. మండలంలోని 29 గ్రామ పంచాయల్లో 293 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ భరత్‌భూషణ్ ఎస్పీకి తెలిపారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎస్పీ అంజయ్య. సీఐ వెంకట్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


