విస్తారంగా వర్షాలు | - | Sakshi
Sakshi News home page

విస్తారంగా వర్షాలు

Jul 30 2026 7:24 AM | Updated on Jul 30 2026 7:24 AM

జిల్లాలో గడిచిన 24గంటల్లో నమోదైన వర్షపాతం మిల్లీ మీటర్లలో

వికారాబాద్‌: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో పంటలకు జీవం పోసినట్లయింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వర్షపాతం. ఒకటి రెండు చోట్ల భారీగా.. మిగతా చోట్ల సాధారణ వర్షపాతం నమోదైంది. రైతన్నకు కాస్త ఉపశమనం లభించింది. వాగులు, వంకలు పారుతూ చెరువుల్లోకి నీరు చేరుతోంది. గడచిన మూడు రోజుల్లో మోమిన్‌పేటలో అత్యధికంగా 45మిల్లీమీటర్లు, నవాబుపేటలో 31 మి.మీ. మర్పల్లిలో 26.9మి.మీ. వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. పలు కాలనీలు నీటి కుంటలను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ బురదమయంగా మారాయి.

ఆనందంలో రైతులు

వానాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పంటలకు సరిపడా వర్షం పడలేదు. అప్పుడప్పుడు కురిసినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. చెలకలు, ఇసుక పొలాల్లో మొక్కజొన్న తదితర విత్తనాలు సగం మొలకెత్తగా మిగతావి ఎండిపోయాయి. ప్రస్తుత వర్షాలు వరి నాట్లు వేసుకునే రైతులకు మేలు చేయనున్నాయి. వానలు ఇలాగే కొనసాగితే బోరు బావులు, చెరువుల్లో నీటి మట్టం పెరిగి నాట్లు ఊపందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పత్తి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసలు, కూరగాయలు, పసుపు తదితర పంటలకు జీవం పోసినట్టయ్యింది. పంటలు పచ్చగా ఉండటంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలోని నాలుగు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా మూడు మండలాల్లో సాధారణం, మరో 13 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. రెండు మూడు మండలాల్లో మినహా మిగతా అన్ని చోట్ల సాధారణ వర్షపాతానికి చేరువయ్యాయి. మొత్తంగా చూస్తే జిల్లాలో ఇంకా 25 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం కనిపిస్తోంది.

అప్రమత్తమైన అధికారులు

గత అనుభవాల నేపథ్యంలో రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. వాగులు, వంకల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో క్షేత్రస్థాయి అధికారుల ను అలర్ట్‌ చేశారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పాఠశాలల హెచ్‌ఎంలతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎరువుల కోసం రైతులు పీఏసీఎస్‌ కేంద్రాలు, ఫెర్టిలైజర్‌ షాపుల బాట పడుతున్నారు. ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

మండలం వర్షపాతం –

మర్పల్లి 26.9 లోటు

మోమిన్‌పేట్‌ 45.5 అధికం

నవాబుపేట 30.00 సాధారణం

వికారాబాద్‌ 11.00 సాధారణం

పూడూరు 11.5 అధికం

పరిగి 4.5 లోటు

కుల్కచర్ల 5.7 లోటు

దోమ 6.5 లోటు

బొంరాస్‌పేట్‌ 5.5 అధికం

ధారూరు 10.6 లోటు

కోట్‌పల్లి 7.2 లోటు

బంట్వారం 12.1 లోటు

పెద్దేముల్‌ 7.6 లోటు

తాండూరు 4.7 లోటు

బషీరాబాద్‌ 2.9 లోటు

యాలాల 3.2 లోటు

కొడంగల్‌ 14.00 లోటు

దౌల్తాబాద్‌ 13.7 లోటు

చౌడాపూర్‌ 6.8 అధికం

దుద్యాల్‌ 6.8 సాధారణం

పంటలకు జీవం

రైతుల్లో చిగురించిన ఆశలు

మూడు రోజులుగా కురుస్తున్న వానలు

ఈ సీజన్‌లో ఇదే అత్యధికం

మోమిన్‌పేటలో 45మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు

ఎరువుల కోసం అన్నదాతల పరుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement