పదేళ్లుగా పాటిస్తున్న కుటుంబం
తాండూరు టౌన్: భౌతికంగా కుటుంబ పెద్ద తమ మధ్య లేకపోయినా, ఆయన నాటిన మొక్కను సంరక్షిస్తూ ఆ మొక్కలోనే ఆయనను చూసుకుంటోంది తాండూరు పట్టణానికి చెందిన ఓ కుటుంబం. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కొట్రిక విజయలక్ష్మి, భర్త కొట్రిక వెంకటయ్య పదేళ్ల క్రితం ఇంటి ఎదుట ఓ మొక్కను నాటారు. తర్వాత ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనపై ఉన్న ప్రేమ, వాత్సల్యంతో ఆ చెట్టుకు ఏటా వెంకటయ్య జయంతి రోజున పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ చెట్టు సంరక్షణార్థం వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో తిరిగి నాటారు. తాజాగా బుధవారం ఆయన జయంతి రోజు కావడంతో కుటుంబ సభ్యులు చెట్టుకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కొట్రిక విజయలక్ష్మి, కొడుకు, కోడలు కొట్రిక శ్రీకాంత్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ కౌన్సిలర్ జావీద్
తాండూరు టౌన్: పట్టణంలోని డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు అర్హుల జాబితాపై మున్సిపల్ 8వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ జావీద్ బుధవారం కలెక్టరేట్‌లో సమాచార హక్కు కింద దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పూర్తిగా వ్యాపార ధోరణిలో అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. ఇటీవల ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఏకంగా సీఎం చురకలంటించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అర్హులను ముందుగా గుర్తించి వారికి ఇళ్లు కేటాయించాల్సి ఉండగా, తొలుత ఇళ్లు కేటాయించి వారి అర్హతపై విచారణ చేపట్టడం హాస్యాస్పదమన్నారు. డబుల్ ఇళ్లకు కేసీఆర్ హయాంలో దరఖాస్తు చేసుకున్న వారిని పరిగణలోకి తీసుకున్నారా? ప్రస్తుతం కేటాయించిన ఇళ్ల విచారణాధికారి వివరాలు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు, అర్హుల జాబితాను కోరుతూ కలెక్టరేట్‌లో ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశానన్నారు. ఇట్టి ప్రశ్నలకు సరైన వివరణ రాకుంటే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శంకర్‌నాయక్
పరిగి: ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా అధ్యాపకులు కార్యాచరణను రూపొందించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శంకర్‌నాయక్ సూచించారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, కళాశాలకు పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, అధ్యాపకులు భాస్కరయోగి తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు: చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళనకరమని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ అన్నారు. పట్టణంలోని పెంజర్ల కూడలిలో బుధవారం ఆయన వాహనదారులు, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఇటీవలి రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగానే మృతి చెందారన్నారు. కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్టులు, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు.


