● భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున్న ముందస్తు చర్యలు తీసుకోవాలి
● ఆస్తి, ప్రాణ నష్టం జరగొద్దు
● లోతట్టు ప్రాంతాలు, వాగులపై ప్రత్యేక దృష్టి సారించాలి
● కలెక్టర్ దీపక్ తివారి
అనంతగిరి: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, నీటిపారుదల, ఇరిగేషన్, వైద్యం, గ్రామ పంచాయతీ, విద్యుత్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, కాలువలు, చెరువులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రహదారులపైకి నీరు చేరడం, పాత భవనాలు, చెట్లు కూలడం వంటి ఘటనలు జరిగితే వెంటనే స్పందించాలన్నారు. అవసరమైన యంత్రాంగాన్ని, సహాయక బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాగులు, వరద ప్రవాహం ఉన్న ప్రాంతాలకు వెళ్లరాదని సూచించారు. అనంతరం ఎస్పీ స్నేహమెహ్ర మాట్లాడారు. పోలీస్ శాఖ పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారని సహాయం కాల్సిన వారు కంట్రోల్ రూమ్ సెల్ నంబర్ 8712670056కు సమచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఉమాశంకర్ ప్రసాద్, వెంకటాచారి, ట్రైయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్, అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, డీఆర్‌ఓ స్వర్ణలత, ఆర్‌డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.
డిజిటలైజేషన్ 78శాతం పూర్తి
జిల్లాలో ఇప్పటి వరకు సర్ డిజిటలైజేషన్ 78శాతం పూర్తి చేసినట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం నగరం నుంచి ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. జిల్లాలో ఎస్‌ఐఆర్ గురించి కలెక్టర్ వివరించారు.


