కాసులిస్తే తప్ప కదలని ఫైళ్లు
తాండూరు: భూ హక్కుదారులను రెవెన్యూ అధికారులు ఏదో ఒక మెలిక పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. భూ సమస్యలు ఉన్న రైతులను అష్టకష్టాలపాలు జేస్తున్నారు. ఇటీవల కాలంలో భూ సమస్యలు మరింత పెరిగిపోయాయి. రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. పహాణి నకలు తీసుకోవాలన్నా కాసులు ఇవ్వాల్సిందే. ఇందు కోసం రూ.500 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 8.73లక్షల ఎకరాల భూములున్నాయి. అందులో పట్టాదారులు దాదాపు 2.70లక్షల మంది వరకు ఉన్నారు.
సేవలు దారుణం
తాండూరు నియోజకవర్గంలో రెవెన్యూ సేవలు మరీ దారుణంగా తయారయ్యాయి. ప్రభుత్వ భూములను రక్షించడం తోపాటు రైతుల భూములకు సంబంధించి పట్టా మార్పిడి, విరాసత్, తప్పులను సరిదిద్దడంలో రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో సమస్య పరిష్కారానికి ఒక్కో రేటు విధించి దండుకుంటున్నారు. తండ్రి పేరిట ఉన్న భూమిని వారసుల పేరిట మార్చాలంటే పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్లు బాధిత రైతులు తెలిపారు. తప్పులు సరిచేయడానికి కూడా ఇదే తరహాలో వసూలు చేస్తున్నట్లు మరి కొందరు ఆరోపించారు.
ప్రజావాణిలో 70శాతం మేర..
జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి భూ సమస్యలపైనే ఎక్కువ అర్జీలు వస్తున్నాయి. గత సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమానికి 70శాతం వరకు రెవెన్యూ పరమైన దరఖాస్తులే అందాయి. దీన్నిబట్టి చూస్తే సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. జిల్లా వ్యాప్తంగా భూ సమస్యలు వందల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. సర్వే చేయాలన్నా సంబంధిత అధికారికి ఇంత ముట్టజెబితే కానీ పొలానికి రాని పరిస్థితి నెలకొంది. రెవెన్యూలో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన ఉన్నతాధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి.
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం
సర్కారు భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు ముందుండి అన్యాక్రాంతం అయ్యేలా చేస్తున్నారు. తాండూరు మున్సిపాలిటీ తోపాటు తాండూరు, బషీరాబాద్ మండలాల్లోని ప్రభుత్వ భూముల్లో నాపరాతి నిక్షేపాలు ఉన్నాయి. వాటిలో అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. పెద్దేముల్ మండలంలోని ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అందుకోసం ప్రతి నెలా రెవెన్యూ అధికారులకు ముడుపులు ముట్టజెబుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా దేవాదాయ శాఖ భూములను పట్టాగా మార్చి కాసులు గడిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ భూములను పట్టాలు చేస్తూ రూ.లక్షల్లో అక్రమార్జన
ప్రజావాణి ఫిర్యాదుల్లో 70శాతానికి పైగా ఆ శాఖ పరిధిలోనివే..
భూ భారతితో మరింత పెరిగిన అవినీతి
తాండూరుకు చెందిన ఖాసీంఅలీకి చెంగోల్ రెవెన్యూ గ్రామంలో వ్యవసాయ భూములు ఉన్నాయి. కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. గ్రామ సర్వే నంబర్ 200, 212లో ఖాసీం అలీ పేరిట 4.27 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ అధికారులు కుటుంబ సభ్యులకు తెలియకుండా పెద్ద మొత్తంలో లంచం తీసుకొని మహబూబ్‌బీ అనే మహిళ పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయం బయటకు రావడంతో ఖాసీంఅలీ కుమారులు అక్బర్‌అలీ, జాఫర్‌అలీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన పట్టాను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాండూరు పట్టణం సాయిపూర్ గ్రామానికి చెందిన రాకేశ్ తాండూరు మండలంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. రెవెన్యూ పరమైన సమస్య తలెత్తడంతో సబ్ డివిజన్ కార్యాలయానికి వెళ్లాడు. సమస్య పరిష్కరించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని ఓ ఉద్యోగి డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని కలిసి తన బాధను వ్యక్తం చేశాడు.


