కొడంగల్: ఆషాఢ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని పట్టణంలోని పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఉదయం 9గంటలకు విష్ణు సహస్ర నామ పారాయణం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
దౌల్తాబాద్: మండల కేంద్రంలోని పెద్ద చెరువులో మొసలి కలకలం రేపింది. శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్తున్న రైతులకు చెరువు ఒడ్డున కనిపించింది. 15 రోజుల క్రితం ఇదే చెరువులో మొదటి సారి కంటపడింది. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. త్వరలో మొసలిని పట్టుకుంటామని, అప్పటి వరకు ఎవరూ చెరువు పరిసరాల్లోకి.. చేపల వేటకు వెళ్లరాదని ఫారెస్టు అధికారులు సూచించారు.
కొడంగల్: ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీ, యువతి మృతి పట్ల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దాడి ఘటనలో మృతి చెందిన యువతికి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఎరన్‌పల్లి శ్రీనివాస్, బుస్స చంద్రయ్య, సాయిలు, శ్రీనివాస్, రాములు, కృష్ణ, వెంకటయ్య తదితరలు పాల్గొన్నారు.
తాండూరు టౌన్: ఆషాఢమాసం ప్రారంభం సందర్భంగా పట్టణంలోని 9వ వార్డులోని రాయకుంట కట్టమైసమ్మ ఆలయంలో శుక్రవారం గోరింటాకు పండుగను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్‌పర్సన్ పట్లోళ్ల దీప ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోరింటాకు నూరి చేతులకు పెట్టుకున్నారు. గోరింటాకు పండినట్లుగా ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని అమ్మవారిని కోరుకున్నట్లు దీప తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సుప్రీత, నాగలక్ష్మి, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రి, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
తాండూరు టౌన్: బీజేపీ నాయకులను అరెస్టు చేయడం సరికాదని ఆ పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరికి నిరసన తెలిపేందుకు సిద్ధమైన బీజేపీ నాయకులను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి భారతీయునికి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ముందస్తు అరెస్టులు చేయడం సబబు కాదని అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో కృష్ణ ముదిరాజ్, పటేల్ విజయ్, లలిత, కిరణ్, శ్రీకాంత్‌రెడ్డి, ప్రకాష్, షాబుద్దీన్ తదితరులు ఉన్నారు.


