పరిగి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రంలో డిపో కమిటీ సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎస్‌జెంరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా విశ్వనాథ్‌గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నరేందర్, ఉపాధ్యక్షుడిగా బీవీఆర్ రెడ్డి తోపాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో వేతన సవరణ ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉద్యోగులు చనిపోతే బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. మెరుగైన వైద్య సేవలు, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కొంత మంది ఆర్టీసీ కార్మికుల్లో అపోహాలు సృష్టిస్తున్నారని వాటిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. కార్మికుల హక్కుల సాధనకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఎల్లప్పుడు ముందుంటుందన్నారు. నూతన కార్యవర్గం సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పరిగి డిపో కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


